Take a fresh look at your lifestyle.

గ్యాస్ కోసం జనం బారులు

 

 

ముద్ర,గద్వాల:

రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత వస్తుందనే అపోహతో జనం సిలిండర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద ఖాళీ సిలిండర్లలతో బారులు తీరుతున్నారు. వంట గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినా పట్టించుకోవడం లేదు. తాజాగా అవసరం లేకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావిస్తూ డబుల్సలిండర్ల వినియోగదారులంతా బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం నిజంగా గ్యాస్అవసరం ఉన్న వారికి దొరకడం లేదు. ఇటీవల ఇరాన్ – ఇజ్రాయిల్ – అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో  వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల  వద్ద ఎల్పీజీ సిలిండర్ల కోసం వినియోగదారులు భారీగా బారులు తీరారు. రానున్న రోజుల్లో సిలిండర్లు దొరకడం కష్టమంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ కావడంతో గ్యాస్‌ సిలిండర్‌ కోసం ఉదయం నుంచే మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ఏజెన్సీ ముందు క్యూలలో నిలబడ్డారు. దీంతో ఏజెన్సీ వద్ద మరింత రద్దీ నెలకొంది. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే డెలివరీకి కనీసం పదిరోజుల సమయం పడుతోంది. గ్యాస్‌ సిలిండర్‌ తీసుకున్న 45 రోజుల తర్వాతనే గ్యాస్‌ తిరిగి బుక్‌ చేసుకోవాలని నిబంధనలు విధించారు.  గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ, సాంకేతిక లోపాల కారణంగా డెలివరీ అథెంటికేషన్ కోడ్ (దిఎసి ) నెం బర్లు మొబైల్కు రాకపోవడంతో ఏజెన్సీ సిలిండర్లను సరఫరా చేయడం లేదంటు వినియోగదారులు ఆరోపించారు. మరోపక్క గ్యాస్ బుకింగ్ గడువు కూడా పెంచడం వినియోగదారులకు సమస్యగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. దీనిపై జిల్లా అధికారులను వివరణ కోరగా జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, బుక్ చేసుకున్న‌ వెంటనే ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.