ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జనగణనలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అచ్చంపేట మండల కేంద్రంలోని ఎంఎస్‌ఎన్ హైస్కూల్‌లో జరుగుతున్న జనగణన శిక్షణ తరగతులను మంగళవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో కాగితంపై జనగణన వివరాలు నమోదు చేసేవారని, ప్రస్తుతం 2027 జనగణనను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండ్ల వివరాలు, జనాభా లెక్కలు నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
డిజిటల్ సర్వే సమయంలో పొరపాట్లు జరిగితే వాటిని వెంటనే సరిచేసుకోవాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లే ముందు హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాప్ ఆధారంగా పరిధులను ముందుగానే పరిశీలించుకోవాలని తెలిపారు. ప్రతి ప్రశ్నకు సమగ్రంగా సమాధానం నమోదు చేసి సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
శిక్షణ సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని, ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని జిల్లా అభివృద్ధికి దోహదపడేలా జనగణనను కచ్చితంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు, మాస్టర్ ట్రైనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.