Take a fresh look at your lifestyle.

రాజ్ భవన్ రహస్యం

గవర్నర్ మార్పు వెనుక బీజేపీ
పక్కా వ్యూహంతోనే మార్పు..?
ఇక రాజ్‌భవన్ వర్సెస్ ప్రజాభవన్
తెలంగాణలో తప్పని వివాదం
ఇప్పుడు అజహరుద్దీన్ ఫైల్ ఎటు..?

ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్లతో వివాదాలు ఆగడం లేదు. తొలి గవర్నర్ నరసింహన్ మినహా.. ఏ గవర్నర్ ఉన్నా.. ఏ ప్రభుత్వం అయినా విభేదాలే ఉంటున్నాయి. కేసీఆర్ ను తమిళిసై సౌందరరాజన్ ఇబ్బందులు పెట్టినట్లుగా ప్రచారం ఉంది. తాజాగా తెలంగాణలో గవర్నర్ ను కేంద్రం అనూహ్యంగా మార్చేసింది. బీజేయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఎలా వ్యవహరిస్తారో దానికి బిన్నంగా జిష్ముదేవ్ శర్మ వ్యవహరించారు. ప్రభుత్వంతో ఎలాంటి లొల్లి పెట్టుకోలేదు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో ఎలాంటి లొల్లి పెట్టుకోవడం లేదు. రాజకీయంగా విభేదిస్తూనే పాలనా పరంగా కలసి పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు గవర్నర్ ను మార్చడంతో… తమ పంధాలోకి బీజేపీ వెళ్లనుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణోల గెలిచి తీరాలనుకుంటున్న బీజేపీ.. గవర్నర్ ద్వారా ఇతర పనులు చక్కబెట్టిని పార్టీని దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఇప్పటి వరకూ వివాదాస్పదం కాని తెలంగాణ గవర్నర్
తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ మార్పు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి, ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించడం వెనుక కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం ఒక పక్కా వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జిష్ణుదేవ్ వర్మ హయాంలో ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య సంబంధాలు చాలా సజావుగా సాగాయి. గతంలో డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హయాంలో ఉన్న ఘర్షణ వాతావరణం జిష్ణుదేవ్ వర్మ వచ్చిన తర్వాత కనిపించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేంద్రంతో పాలనాపరమైన సత్సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. అయితే, తాజా మార్పుతో బీజేపీ తన పంథాను మార్చుకోబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిష్ణుదేవ్ వర్మను కీలకమైన మహారాష్ట్రకు పంపి, సీనియర్ రాజకీయ నేత శివ ప్రతాప్ శుక్లాను ఇక్కడకు తీసుకురావడం వ్యూహాత్మకమే.

బీజేపీ మాస్ వ్యూహం ?
కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆరితేరిన నేత. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా గమనించిన చరిత్ర ఆయనది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవాలని చూస్తున్న తరుణంలో, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంలోనూ, రాజ్యాంగపరమైన అంశాల్లో గట్టిగా వ్యవహరించడంలోనూ ఆయన క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కొన్ని ప్రాంతాల్లో మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడటంతో, 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కేవలం రాజకీయ పోరాటమే కాకుండా, గవర్నర్ వ్యవస్థ ద్వారా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. బిల్లుల ఆమోదం, యూనివర్సిటీ నియామకాలు, పాలనాపరమైన విచారణల విషయంలో ఇకపై రాజ్ భవన్ నుంచి గట్టి సమాధానాలు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ – ఇక ప్రత్యక్ష యుద్ధం ?
ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో రాజకీయంగా విరోధం – పాలనాపరంగా మైత్రి అనే సూత్రాన్ని పాటిస్తోంది. కానీ, గవర్నర్ మార్పుతో ఈ వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న దూకుడు గవర్నర్ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తే, రేవంత్ సర్కార్‌కు ఇబ్బందులు తప్పవు. బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా, ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చాటిచెప్పడానికి, గవర్నర్ మార్పు ఒక మొదటి అడుగుగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై గవర్నర్ జోక్యం పెరిగితే, అది సహజంగానే అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా సవాలుగా మారుతుందని అనుకోవచ్చు.

అజారుద్దీన్ కు కష్టమేనా..?
తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చారు. ముగ్గురు గవర్నర్లు మారినా ప్రొఫెసర్ కోదండ రాం ఎమ్మెల్సీ పదవి మాత్రం ఇంకా ఊగిసలాటలోనే వుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కూడా ఎమ్మెల్సీగా ఎన్నికవడానికి గడువు దగ్గరపడుతోంది. వారి పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర క్యాబినెట్ చేసిన సిఫారసులు ఈ గవర్నరైనా ఆమోదించి చట్టసభ సభ్యులయ్యే అవకాశమిస్తారో లేదో అనే టెన్షన్ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది.

త్రిశంఖు స్వర్గంలోనే ప్రొ. కోదండరాం ఎమ్మెల్సీ పదివి
తెలంగాణ జేఏసీ కన్వీనర్, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం శాసన మండలిలో అడుగుపెట్టే అదృష్టం చాలా కాలంగా ఊగిసలాడుతూ వస్తోంది. రెండు సార్లు ప్రభుత్వం ఆయన అభ్యర్దిత్వాన్ని గవర్నర్ కు సిఫారసుచేసినా, గవర్నర్ ఓసారి ఆమోదించినా న్యాయపర చిక్కులు ఆయన ప్రమాణస్వీకారానికి అడ్డుపడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ ను, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా సిఫారసులు పంపింది. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వారి పేర్లను తిరస్కరించారు. ఇద్దరికీ రాజకీయ పార్టీతో ప్రత్యక్ష సంబందాలున్నాయనీ, ఏ రంగంలోనూ నిష్ణాతులు కాదు కాబట్టి ఆ పేర్లను తాను ఆమోదించలేనని చెప్పారు. ఇంతలో కేసీఆర్ ప్రభుత్వం మారి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. గవర్నర్ నిర్ణయం పై దాసోజు హైకోర్టును ఆశ్రయించారు. క్యాబినెట్ చేసిన సిఫారసులను తిరస్కరించే అధికారం గవర్నర్ కు ఉండదని హైకోర్టులో పిటిషన్ లో పేర్కొన్నారు.

అప్పట్నుంచీ కోర్టు చిక్కుల్లోనే
2023 డిసెంబర్ లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత సిఫారసులను వెనక్కు తీసుకుని కొత్తగా ప్రొఫెసర్ కోదండరాం, పాత్రికేయుడు ఆమిర్ అలీ ఖాన్ లను ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. ఈసారి గవర్నర్ వారి పేర్లకు ఆమోదం కూడా తెలిపారు. దాసోజు శ్రవణ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు 2024 మార్చిలో గవర్నర్ తమిళిసై నిర్ణయాన్ని తప్పుపట్టింది. గవర్నర్ కు క్యాబినెట్ సిఫారసులను తిరస్కరించే అధికారం లేదని చెప్తూ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ల నామినేషన్ చెల్లదని చెప్పింది. హైకోర్టు నిర్ణయం పై సుప్రీం కోర్టు మొదట స్టే ఇచ్చింది. దీంతో ప్రక్రియ మళ్లీ మొదలైంది, ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కోదండరాం, అజరుద్దీన్ ల పేర్లను గవర్నర్ కోటాకింద సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు 2025 ఆగస్టులో మునుపటి వ్యాఖ్యలపై తదుపరి వివరణ ఇస్తూ ప్రభుత్వ సిఫారసు చేసిన పేర్లకు నిబంధనలు పాటిస్తూ గవర్నర్ ఆమోదం తెలిపినా అది కోర్టు తుది తీర్పునకు లోబడే చెల్లుబాటవుతుందని చెప్పింది.

కొత్త గవర్నర్ ఏం చేస్తారు.. గండం నుంచి అజర్ మంత్రి పదవి బయటపడుతుందా.. ?
సుప్రీకోర్టు తుది తీర్పునకు లోబడే అనే నిబంధన నేపధ్యంలో అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు. మరి ఇప్పుడు నూతన గవర్నర్ గా శివ్ ప్రతాప్ శుక్లా ఆధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలో ఈయన ఏంచేస్తారు. కొత్త గవర్నర్ ను ఒప్పించి ఆమోదించుకోవడంలో రేవంత్ సఫలీకృతులవుతారా.. లేదా మూడో సారి కోదండరాం పేరును సిఫారసు చేయాల్సుంటుందా. ఇప్పటికే మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి చట్టసభ సభ్యూడయ్యేందుకు నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్న అజర్ భవితవ్యం ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దాసోజు శ్రవణ్ మాత్రం మా పిటిషన్ పండింగ్ లో వుండగా కొత్త గవర్నర్ కూడా ఆమోదం తెలపలేరంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే మంత్రి పదవికి అజర్ అర్హత కోల్పోయే ప్రమాదం పొంచివున్నట్టే.

 

Leave A Reply

Your email address will not be published.