- తెలంగాణ ఉద్యానవర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి
ముద్ర ప్రతినిధి, వనపర్తి : రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థుల కు మధ్యాహ్న భోజనంలో అవసరమైన కూరగాయలు అలాగే పండ్లు సొంతంగా పాఠశాలలో పెంచుకోవడానికి ‘ఉద్యాన మోడల్’ అభివృద్ధి చేస్తున్నామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి అన్నారు.ఆధునిక పరిజ్ఞానంతో కూడిన నైపుణ్యాభివృద్ధి తోనే విద్యార్థులు బంగారు భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎక్క గ్రూపు ఫౌండేషన్తో కలిపి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని మోజెర్లలో గల ఉద్యాన కళాశాల వేదికగా ఏర్పాటు చేసిన కెరీర్ ట్రైనింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.పోటీ ప్రపంచంలో నైపుణ్యంతో పాటు పర్సనల్ డెవలప్మెంట్ ముఖ్యపాత్ర వహిస్తున్నాయని అన్నారు.ప్రతి కళాశాలలో పోటీ పరీక్షలకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులతో కోచింగ్ ఏర్పాటు చేస్తాము అని వైస్ ఛాన్స్లర్ రాజిరెడ్డి అన్నారు.
- వేసవిలో మొక్కల సాంద్రత పెంచండి, నీటి కుంటలు నిర్వహించండి
అనంతరం ఉద్యాన విద్యార్థుల అవగాహన క్షేత్రాలను పరిశీలించి మొక్కల సాంద్రత పెంచితే వేసవిలో తోట పంటలను రక్షించ వచ్చని తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక భూములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భూసార పరీక్షలు చేపట్టిన తర్వాతే ఉద్యాన తోటలు పెంచుకోవాలన్నారు.ఉద్యాన కళాశాల ఆధ్వర్యంలో మామిడి, నేరేడు, దానిమ్మ, ఫిగ్, సీతాఫలం వంటి పండ్ల తోటల్లో అంటు మొక్కల ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తామని తెలిపారు.తోటల్లో నీటి కుంటలు నిర్వహణతో వేసవిలో పంటలను కాపాడుకోవచ్చని డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు. ఉద్యాన ఆధారిత పరిశ్రమలు,వ్యాపారాత్మక అవకాశం ఉన్న ఉత్పత్తులపై దృష్టి సారించాలని విద్యార్థులను కోరారు. విద్యార్థి ఉద్యాన అంకుర పరిశ్రమల ఏర్పాటుకు యూనివర్సిటీ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.విద్యార్థినులకు అదనపు గదుల నిర్మాణం త్వరలోనే చేపడతామని తెలిపారు. అన్ని ఉద్యాన పంటలపై అవగాహన కోసం వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు స్టూడెంట్స్ ఎక్స్పోజర్ విజిట్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
- అందుబాటులోకి భారత వాతావరణ కేంద్రం ఆటోమేటిక్ వెదర్ స్టేషన్
భారత వాతావరణ కేంద్రం ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ప్రారంభించిన వైస్ ఛాన్స్లర్ త్వరలోనే ఖచ్చితమైన వాతావరణ ఆధారిత ఉద్యాన సలహాలతో రైతులకు చీడపీడల నివారణ, సాగులో మెలకువలు విశ్వవిద్యాలయం అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఆటోమేటిక్ వెదర్ రిజిస్ట్రేషన్తో ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వర్షపాతం, గాలి దిశ, సూర్యరష్మి, సంబంధించిన అంశాలు ఇక స్థానికంగా ఉద్యాన కళాశాల నుంచి రైతులకు జిల్లా వ్యాప్తంగా అందుతాయని తెలిపారు.కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ భగవాన్, అసోసియేట్ dean డాక్టర్ పిడిగం సైదయ్య,ఎస్టేట్ ఆఫీసర్ నాగేశ్వర్ రెడ్డి, అడ్వైజర్ వీరాంజనేయులు, డాక్టర్ షహనాజ్, పూర్ణిమ మిశ్రా, శ్రీనివాస్, శంకర్ స్వామి, గౌతమి, విద్యా, నవ్య శ్వేత, భాస్కర్, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.
