Take a fresh look at your lifestyle.

ఈ ఏడాది దేశానికి మంచి భవిష్యత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మోడీ నాయకత్వంలో అభివృద్ధి పధంలో భారత్
బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది పంచాంగం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఈ ఏడాది దేశానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు పుష్కలంగా పండుతాయన్నారు. ప్రజలందరూ ఎటువంటి సమస్యలు లేకుండా సుఖశాంతులతో జీవించబోతున్నారని వెల్లడించారు. మన దేశ ఎదుగుదలను ఓర్వలేని శత్రువులకు, దేశద్రోహులకు మాత్రమేనని పరాభవం ఉంటుందని చెప్పారు. గురువారం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి పంచాంగ శ్రవణం అనంతరం రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాలు నేడు యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, శాంతిభద్రతల సమస్యలతో సతమతమవుతున్నాయని చెప్పారు. భారతదేశం మాత్రం ప్రధాని మోడీ శక్తివంతమైన నాయకత్వంలో అభివృద్ధి పథంలో నిరంతరం దూసుకుపోతోందని చెప్పారు. దేశ ప్రజలు ఐక్యంగా నిలబడి, ఏ సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారని ఇది మనందరికీ గర్వకారణమన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితానికి ప్రతీక అని కిషన్ రెడ్డి చెప్పారు. సుఖదుఃఖాలు, కష్టనష్టాలు అన్నీ కలగలిసి ఉండటమే జీవితం అన్న ఆయన ఈ కొత్త సంవత్సరంలో భారతదేశానికి మరింత అభివృద్ధి, శాంతి, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.