Take a fresh look at your lifestyle.

వందేమాతరం పాడాల్సిందే లేదంటే లోపలేస్తాం-కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అరాచకాలను ఎండగడతాం
రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానిది ద్వంద్వ నీతి
రైతు కూలీలు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏమైందీ..?

ముద్ర, కరీంనగర్ :

దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. లేదంటే లోపల వేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో గవర్నర్ శుక్లా ప్రసంగంపై ధన్యవాద తీర్మాణంపై చర్చ సమయంలో జరిగిన వందేమాతరం ఆలపనలో ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోవటాన్ని బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ దేశంలో ఉండేవారు ఎవరైనా వందేమాతరం పాడాల్సిందేనని అన్నారు. తాము అధికారంలోకి వస్తే దీనిని తప్పనిసరి చేస్తామని.. అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం నేతల ఓటు బ్యాంకు రాజకీయాలకు సీఎం, స్పీకర్ తలొగ్గుతున్నారని విమర్శించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అరాచకాలను ఎండగడతామని, అసదుద్దీన్ ఓవైసీ నడిపే విద్యా సంస్థల్లోనే ఉగ్రవాద మూలాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ నీతి అవలంభిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు కూలీలకు, కౌలు రైతులకు సాయం ఎందుకు అందడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ నెల 22న ఇస్తామన్న రైతు భరోసా సహా, పెండింగ్‌లో ఉన్న ఐదు వాయిదాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో సబర్మతి నదిని అభివృద్ధి చేసినట్లు ఇక్కడా మూసీ పునరుజ్జీవం చేయాలన్నారు. అందుకోసం బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బాధితులకు తగిన పరిహారం చెల్లించిన తర్వాతే ముందడుగు వేయాలని సూచించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ ఛురకలంటించారు. శాసనసభ, స్పీకర్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి కష్టాలు తొలిగిపోయి సుఖశాంతులతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.