- జపాన్ మోడల్లో ఏర్పాటు.
- జపనీస్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం.
- సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, పట్టణావిష్కరణలో సహకారం.
- హైదరాబాద్– కిటాక్యూషుమధ్య విమాన కనెక్టివిటీకి ప్రయత్నం.
- జపాన్ “కితాక్యూషూ సిటీ” స్ఫూర్తితో అభివృద్ధి.
- ఏడాదిన్నరలో తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు.
- మంత్రి శ్రీధర్ బాబు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్దే లక్ష్యంగా జపాన్ లోని “కితాక్యూషూ సిటీ” స్ఫూర్తితో రాష్ట్రంలో 80 ఎకరాల్లో ఎకో టౌన్ ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.తెలంగాణ, కితాక్యూషూ నగరం మధ్య కుదిరిన పరస్పర సహకార ఒప్పందం ఇందుకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.సోమవారం టీహబ్ లో “ఫ్రం కితాక్యూషూ టూ తెలంగాణ: కేటలైసింగ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ గ్రోత్” అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.”తెలంగాణ రైజింగ్ 2047″ అనే లక్ష్యంతో అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్ గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమన్నారు.ఏడాదిన్నరలో రాష్ట్రానికి సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు.రాష్ట్రంలో జపాన్ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన 50 మంది యువతకు జపాన్ లో ఉపాధి అవకాశాలు లభించాయని, మరింత మందికి దక్కేలా టాంకాం లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారా జపనీస్ భాషను నేర్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో నెట్ జీరో లక్ష్యాలు, రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, సర్క్యులర్ ఎకానమీ, క్లీన్ టెక్నాలజీస్, డిజిటల్ ఇన్నోవేషన్ తదితర అంశాల్లో కితాక్యూషూ నగరంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీని పర్యావరణహితంగా తీర్చి దిద్దేందుకు ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు, జీరో వేస్ట్ డిజైన్, అత్యాధునిక వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణ, కితాక్యూషూ నగరం మధ్య సత్సంబంధాలు మరింత పెరిగేలా హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడిపేందుకు గల సాధ్య సాధ్యాలపై అధ్యయనం చేయిస్తామన్నారు.తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా జపాన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని మంత్రి కోరారు.
- సీఎం సమక్షంలో ఒప్పందం.
కిటాక్యూషు నగరం ఎకో -టౌన్ మోడల్ తో చాలా ప్రేరణ పొందామని, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌లో అలాంటి నమూనాను అభివృద్ధి చేయడం కోసం అనేక జపనీస్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.తెలంగాణ, కిటాక్యూషు మధ్య సహకార ఒప్పందంపై సోమవారం సంతకాలు చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఒప్పందం సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణలలో సహకారానికి పునాది కానున్నదని, మూసి నది అభివృద్ధి,పునరుజ్జీవన ప్రాజెక్ట్ పైన ప్రత్యేక దృష్టి ఉందంటూ సీఎం వివరించారు.
