- ఆకుపచ్చని పెద్దపల్లి కోసం కలిసి అడుగెద్దాం.
- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు.
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పర్యావరణ సంరక్షణ మనందరి బాధ్యత అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని ఐటీఐ కళాశాలలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా అటవీ అధికారి శివయ్య, ఆర్టీవో రంగారావు, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తో కలిసి ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. సమస్త మానవాళి జీవనానికి ప్రాణవాయువు అందించే చెట్లను పెంచాలని, అలాగే మొక్కలు అధికంగా నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. పర్యావరణం సమతుల్యంగా ఉండటానికి 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలని దానికి అనుగుణంగా పెద్దపల్లి లోని ప్రజలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 18 కోట్ల మొక్కలను నాటాలన్న బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని, అందుకు అనుగుణంగా పెద్దపల్లిలో ప్రతి విద్యార్థి, యువత తమ ఇళ్లలో, పొలాల్లో ఎక్కడ తమకు స్థలం ఉంటే అక్కడ చెట్లు నాటాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతను అధికారులు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్ల వాకిలిలో మొత్తం బండలు, కాంక్రీట్ వేసుకోకుండా కొంత స్థలం మొక్కలు నాటేందుకు ఉంచుకోవాలని అలాగే ఇళ్లలో పెళ్లి అయిన, పుట్టిన రోజు జరుపుకున్న మరే ఇతర శుభ కార్యక్రమాలు జరుపుకున్న ఆరోజుకు గుర్తుగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని సూచించారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ సంవత్సరం అత్యధికంగా మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ లక్ష్యం మేరకు రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటేందుకు ఆయా ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు, విద్యార్థులు అందరూ వారి వారి ఇళ్లలో పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్నారు. అలాగే పెద్దపల్లి ఐ.టి.ఐ మైదానంలో ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, సుల్తానాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, తహసిల్దార్ రాజయ్య, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
