అబద్దాల పునాదులపైనే సీఎం అయ్యారు
అబద్దాలతోనే మహిళలను వంచించారు
మహిళలందరికీ ప్రతినెలా రూ.2500లు ఇస్తానని మోసం చేశారు
తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువునా ముంచారు
మహిళా బిల్లును అడ్డుకుని దక్షిణాదికి తీరని ద్రోహం చేస్తున్నారు
అబద్దాలు, మోసాలనే ప్రజలు నమ్ముతారని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి
నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం రేవంత్ కు ఉన్నట్లుంది
కేసీఆర్ తరహాలోనే అబద్దాలు, మోసాలతోనే పాలన కొనసాగిస్తున్నారు
పార్లమెంట్ లో బిల్లును అడ్డుకుని దక్షిణాదికి తీరని ద్రోహం చేశారు
ముద్ర, కరీంనగర్ : అబద్దాలు, మోసాలనే నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘‘అభినవ గోబెల్స్’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. అబద్దాలు, మోసాలు చేసే వారినే ప్రజలు నమ్ముతారని బహిరంగంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ అబద్దాల పునాదులపైనే ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని, రాష్ట్రంలోని ప్రతి మహిళలకు ప్రతినెలా రూ.2500లు చెల్లిస్తామని, తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలోని అంశాలిలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే దొంగ హామీలు, పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలనను కొనసాగిస్తున్నారు. నిజాయితీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం ఆయనకు అలవాటుగా మారింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచి దక్షిణాదికి న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యలోని ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెడితే ఇండీ కూటమి నేతలు బిల్లును అడ్డుకున్నారు. ఈ విషయంలో లేనిపోని విష ప్రచారం చేసి మహిళా బిల్లును అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టం జరగబోతోందని తప్పుడు ప్రచారాలకు తెరదీసి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగకుండా కుట్రలు చేశారు.
జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం. దీనిని ద్రుష్టిలో ఉంచుకునే మోదీ ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచడం ద్వారా దక్షిణాదికి మేలు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే, ఇండీ కూటమి పేరుతో అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి తోపాటు తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ఇండీ కూటమి నేతలు దక్షిణాదికి ఉన్న అవకాశాలకు గండికొట్టారు. దక్షిణాదికి తీరని నష్టం చేశారు. ముఖ్యంగా కుటిల రాజకీయాలతో మహిళల కలలను కల్లలు చేశారు. మహిళా బిల్లును అడ్డుకుని ఏదో సాధించామని సంబురాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ మహిళలతోపాటు దేశంలోని 70 కోట్ల మహిళలెవరూ ఇండీ కూటమి చేసిన అవమానాన్ని ఎన్నటికీ మర్చిపోరు. అతి త్వరలోనే రేవంత్ రెడ్డిసహా ఇండీ కూటమి నేతలు తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయం. మహిళలంతా ఏకమై రేవంత్ రెడ్డి సర్కార్ ను గద్దె దించడం తథ్యం. కాంగ్రెస్ చేసిన మోసాలను తెలంగాణలోని గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఆధ్వర్యంలోని పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది.