- కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు.
- తాజాగా 81 వేల కోట్ల ప్రాజెక్టుకు పూర్తి ప్రతిపాదనలు.
- 200 టీఎంసీల వరద జలాలను తరలించుకుంటామని స్పష్టం.
- కేంద్ర ఫైనాన్స్ సెక్రెటరీకు ప్రజంటేషన్ ఇచ్చిన ఏపీ అధికారులు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : గోదావరి జలాల తరలింపుపై ఏపీ దాగుడుమూతలు ఆడుతున్నది. పోలవరం ప్రాజెక్టుకు త్వరగా పూర్తి చేసి బనకచర్లకు, ఆపై కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను మళ్లించాలనే కుట్రకు పునాది పడింది. తాజాగా పోలవరం– -బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ముందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకెళ్లింది. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు సోమవారం సాయంత్రం సుమారు 2 గంటలపాటు వివరించారు. రూ.81,000 కోట్లతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ ప్రాజెక్టుతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖ అధికారులు కేంద్రానికి వివరించారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఎంత అభ్యంతరం చెప్పుతున్నా ఏపీకి కేంద్రం మద్దతుగా నిలుస్తున్నది. గత నెలలో జరిగిన భేటీల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి సీఎం చంద్రబాబు వివరించారు. సీఎం ప్రతిపాదనలపై పూర్తి వివరాలు ఇవ్వాలని గతంలో కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు అందించారు.ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభనష్టాలను వివరించారు.భవిష్యత్తులో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని చెప్పారు.తెలంగాణ లేవనెత్తనున్న అభ్యంతరాలపై కూడా ప్రజెంటేషన్‌లో సమాధానం ఇచ్చారు.
- వెనక్కి తగ్గని ఏపీ.
బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వల్ల రైతులకు అత్యధిక మేలు జరుగుతుందని అక్కడి ప్రభుత్వం చెప్పుతూ వస్తుంది. అలాగే పలు ప్రాంతాలకు సాగు, తాగు నీరు సైతం అందించ వచ్చని ప్రభుత్వం చెబుతుంది. ఈ బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు అత్యధిక లబ్ది చేకూరనుందని, వీటితో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సైతం నీటి సమస్య తీరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాదాపు 80 లక్షల మంది ప్రజలకు ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం కలగనుందని పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల గోదావరి వరద నీటిని రాయలసీమ బేసిన్‌కు తరలించడం వల్ల కలిగే లాభాలను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ఏపీ అధికారులు వివరించారు.ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాల గురించి కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఏపీ అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.అయితే, సముద్రంలోకి వృధాగా పోతున్న సుమారు 2 వేల టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ ఉన్న తెలంగాణకు కూడా ఉపయోగమే ఉంటుంది తప్ప తెలంగాణ రాష్ట్ర నీటిని తామేమీ తీసుకోవడం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని అధికారులు వివరించారు. తెలంగాణ లెవనెత్తుతున్న అభ్యంతరాలపై కూడా ప్రజెంటేషన్‌లో సమాధానం ఇచ్చినట్లు తెలుస్తున్నది.ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ ఉన్న తెలంగాణకు కూడా ఉపయోగమే ఉంటుంది తప్ప ఆ రాష్ట్ర నీటిని తామేమీ తీసుకోవడం లేదని సీఎం చంద్రబాబు తరపున అధికారులు పదేపదే కేంద్రానికి వివరించారు.