- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : పాఠశాలల పునః ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలను పూర్తి స్థాయిలో పాఠశాలలకు అందిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు. బుధవారం కొత్తగూడెంలోని జిల్లా పాఠ్యపుస్తకాల గోడౌన్ను పరిశీలించిన ఆయన ఇప్పటికే 70 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయని, మిగిలినవి ఈనెల 25 లోపు జిల్లా కేంద్రానికి వస్తాయని తెలిపారు. చేరుకున్న వెంటనే వాటిని మండలాలకు, అక్కడి నుండి పాఠశాలలకు సరఫరా చేస్తామన్నారు. ఈసారి అన్ని రకాల పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను మండల కేంద్రానికి చేరుస్తామని, అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఆయా మండలాల మండల విద్యాశాఖ అధికారి ద్వారా పాఠ్య పుస్తకాలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పుస్తకాలు పాఠశాలకు సరఫరా అయ్యే సమయానికి పాఠశాలల్లో అందుబాటులో ఉండి, తీసుకోవాలని, పాఠశాల పునః ప్రారంభం రోజున ప్రతి విద్యార్థికి అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ, నాగ రాజశేఖర్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్ పాల్గొన్నారు.