ముద్ర ప్రతినిధి, మెదక్:
మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి మత్స్యకారులకు ఆవగాహన సదస్సు ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా మత్స్యశాఖ ఇన్చార్జి గడప దేవేందర్ లు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..
మత్స్య సంపదను పరిరక్షించడం ద్వారా మత్స్యకారుల ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మత్స్య కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని ప్రతి మత్స్యకారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం మార్కెట్‌లో చేపలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు.

మత్స్య సహకార సంఘం పర్సన్ ఇంచార్జి గడప దేవేందర్ మాట్లాడుతూ..ప్రతి మత్స్యకారుడు ప్రకృతి సంపదను కాపాడే బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి మెదక్ జిల్లా మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, రుణ సౌకర్యాలు, బీమా పథకాలు, మత్స్యకార భరోసా పథకాల గురించి వివరించి ప్రతి లబ్ధిదారుడు నమోదు చేసుకోవాలని కోరారు.
పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థికాభివృద్ధికి బలం
పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థికాభివృద్ధికి బలం అని అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. నర్సాపూర్ మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో పశు చికిత్స, అవగాహన శిబిరాన్ని నిర్వహించగా అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించి, దూడలు, గొర్రెలు, మేకలకు నులిపురుగుల నివారణ మందులు వేయించారు. అనంతరం ఖనిజ మిశ్రమాన్ని రైతులకు పంపిణీ చేశారు.
ఈ శిబిరం ద్వారా పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించారు. ఇందులో భాగంగా పశువులకు వైద్య సేవలు అందించగా, రైతులు పాల్గొని ఈ సేవలను సద్వినియోగించుకున్నారు.
పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతుకు ఆర్థికంగా లాభం చేకూరుతుందన్నారు.
రైతులు పశువులకు సమయానికి టీకాలు వేయించడం, పోషకాహారం అందించడం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
పశువుల్లో వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే సమీప పశు వైద్య అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.