తెలంగాణ యువత కోసం రాష్ట్రంలో మొట్టమొదటిసారి మెగా జాబ్ మేళా ప్రారంభం\
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
యువత ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ప్రముఖ కంపెనీలే జిల్లా కేంద్రానికి వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభపరిణామమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రముఖ 1M1B సంస్థ సహకారంతో కుంభం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కుంభం కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా కార్యక్రమం భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ పాఠశాల ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి శుక్రవారం ప్రారంభించారు.

ఈ జాబ్ మేళా మే 8, 9, 10 తేదీలలో జరుగుతాయని దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రముఖ 1M1B సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 25 ప్రముఖ కంపెనీలు పాల్గొని దాదాపు 3500 ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుప్పం, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రాంతాల్లో విజయవంతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన 1M1B సంస్థ, ఇప్పుడు తెలంగాణ యువత
కోసం రాష్ట్రంలో మొట్టమొదటిసారి యాదాద్రి భువనగిరిని వేదికగా ఎంచుకోవడం విశేషంగా నిలిచిందన్నారు.

ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా , ఇతర అర్హతలు కలిగిన యువతకు ఈ జాబ్ మేళా ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రైవేట్ రంగంలోని ప్రముఖ కంపెనీలు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయన్నారు.
జాబ్ మేళా మొదటి రెండు రోజులు అయిన మే 8, 9 తేదీలలో అభ్యర్థుల స్క్రీనింగ్, సర్టిఫికెట్ల పరిశీలన మరియు టోకెన్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించబడుతుందని అనంతరం మే 10న ప్రధాన ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని చెప్పారు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతకు ప్రత్యేకంగా గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌పై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళా వేలాది మందికి ఉపాధి మార్గాన్ని చూపుతుందని తెలిపారు.
గత కొద్దిరోజులుగా ఈ కార్యక్రమం విజయవంతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వాలంటీర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 10వ తేదీన నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యువత, ప్రజలు, నిర్వాహకులు అందరూ సమన్వయంతో ముందుకు రావాలని కోరారు.
గ్రామీణ,పట్టణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యువత తమ భవిష్యత్తును నిర్మించుకునే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ మెగా జాబ్ మేళాకు భారీ సంఖ్యలో యువత హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుంభం ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేష్, వార్డ్ కౌన్సిలర్ తాహీరా బబ్లు, భువనగిరి పట్టణ, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.