ఎస్.ఎల్.బి.సి పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించం
నిరంతరం పనుల సమీక్ష పై రూట్ మ్యాప్
భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వం చేతికి హెలి-బోర్న్ సర్వే నివేదిక
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్.ఎల్.బి.సి నిర్మాణం పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సొరంగం మార్గం పనులను నిరంతరం కొనసాగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. సొరంగ నిర్మాణ పనులలో ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. దని ఆయన వివరించారు. అర్దాంతరంగా నిలిచి పోయిన ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ కోసం చేపట్టిన హెలి-బోర్న్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని తెలిపారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో అంతర్భాగమైన మేడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం బ్యారేజ్ ల పునరుద్ధరణ పనులపై ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో నీటిపారుదల శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం మిగిలిన భాగం పూర్తి చేయడానికి అవసరమైన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఏరియల్ ఎలాక్ట్రో మాగ్నెటిక్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని ఆయన తెలిపారు. సొరంగమార్గం పూర్తికి సర్వే ఆధారంగా రూపొందించిన నివేదిక దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భౌగోళికంగా ప్రతికూల పరిస్థితిలు ఏర్పడితే ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టదానికి ఈ సర్వే ఉపకరిస్తుందని పేర్కొన్నారు. సొరంగమార్గం పూర్తి చేసేందుకు ఆధునిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు శాస్త్రీయ పద్దతిలో నిరంతరం అధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహణకు ప్రత్యేకంగా డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆపరేషన్ బృందానికి ప్రత్యేక చీఫ్ ఇంజనీర్ ను నియమించాలని ఆదేశించారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎప్పటికప్పుడు భద్రతా,నాణ్యత ప్రమాణాలను పాటించేలా చూడడంతో పాటు అధికారులు రూపొందించిన డిజైన్ ప్రకారం నిర్మాణం కొనసాగేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన చీఫ్ ఇంజినీర్ కు సహకరించేలా ఉండేందుకు స్వతంత్ర పర్యవేక్షణ కన్సల్టెంట్ ను నియమించాలన్నారు. నిరంతరం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్షేత్ర స్థాయిలో భాగస్వామ్యులు అవుతారని ఆయన చెప్పారు. సొరంగ మార్గంలో ఏర్పదుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక జియో టెక్నీకల్,జియాలజికల్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు కాళేశ్వరం బ్యారేజ్ ల పనుల పునరుద్ధరణ పనులు వేగవంతం కోసం అవసరమైన సాంకేతిక సంస్థలను,డిజైన్ కన్సల్టెంట్స్ సమన్వ్యయం ఆవశ్యకత గురుంచి మంత్రి వివరించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించే పరీక్షల షెడ్యూల్ ,ప్రాజెక్ట డిజైనర్ల పనితో సమన్వయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరస్పరం సమన్వయం చేసుకుంటూ పోతే కేంద్ర జల వనరుల సంఘం పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుండి డిజైన్ లకు దశలవారిగా అనుమతులు పొందడం సులభతరమౌతుందని ఆయన చెప్పారు . ఈ మేరకు ఫిబ్రవరి 16 తరువాత ఎన్.డి.ఎస్.ఏ నిపుణుల కమిటీ తో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అనుమతులు పొంది పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.