ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల శిక్షణా తరగతులకు హాజరై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పాల్గొని క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో నేరుగా ముచ్చటించారు.
పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు వంటి కీలక అంశాలపై ఆయన వివరంగా చర్చించారు. ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలని, అందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమకాలీన రాజకీయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరమని చెప్పారు.
2019 నుంచి 2024 మధ్య రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించిన ముఖ్యమంత్రి, ఆ కాలంలో జరిగిన పరిణామాలను ప్రజలకు గుర్తు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేస్తే వారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, దీర్ఘకాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు ఘటన వంటి అంశాలను ప్రస్తావించారు. నేరగాళ్లతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వస్తోందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
టీడీపీలో కార్యకర్తలకే అధినేత స్థానం ఉంటుందని, వారికి పార్టీ పూర్తి గౌరవం ఇస్తుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు లోనుకాకుండా, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో పడుతున్న కష్టాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు, పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.