- జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.శనివారం జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్ లో జగిత్యాల అర్బన్, రూరల్ మండలం లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని, రైతులు దీనిపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు.పారదర్శకత జవాబు దారీతనంతో పని చేసేలా ఈ చట్టాన్ని రూపొందించిందని అన్నారు.భూ భారతి చట్టం ద్వారా పక్కగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని, రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉంటుందని అన్నారు.భూ భారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్ల పై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పిల్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు.వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసిల్దార్ విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువు 30 రోజులలోగా మ్యూటేషన్ పూర్తి చేయకుంటే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు.భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు.భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు.భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూ దార్ కార్డు అందించడం జరుగుతుందని అన్నారు.భూ భారతి లో సులభమైన మోడల్స్ మాత్రమే ఉండి సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, తహసిల్దార్ నుండి సీసీఎల్ఏ వరకు ఆపిల్ వ్యవస్థను వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. పెండింగ్ సాదా బైనామాల పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి పి మధుసూదన్, అర్బన్,రూరల్ తహశీల్దార్లు రామ్మోహన్, శ్రీనివాస్ రైతులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
