Take a fresh look at your lifestyle.

గులాబీలో గుబులు …  పార్టీ నాయకత్వంపై దిగులు

  • పెద్దబాస్ ఫాంహౌజ్ విడిచి రాడు….
  • చిన బాస్ అరెస్టు కాకుండా ఎన్ని రోజులు ఉంటారో తెలియదు 
  • అరెస్టు అయి జైలు వెళితే…పార్టీనీ నడిపించే నేత ఎవరు? 
  • మరి హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగిస్తారా? 
  • లేక కవితను రంగంలోకి దింపుతారా?
  • పార్టీ శ్రేణుల్లో మొదలైన కలవరం 
  • రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న అంధకారం
  • మళ్లీ మొదలైన కాళేశ్వరం భయం
  • కేసీఆర్​, హరీశ్ కు నోటీసులు ఇస్తారనే టాక్​ 
  • నోటీసులు ఇస్తే గులాబీల్లో రాజకీయ స్తబ్ధత
ముద్ర, తెలంగాణ బ్యూరో :- పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని శాసించిన గులాబీ పార్టీలో ప్రస్తుతం నాయకత్వ గుబులు మొదలైంది. పటిష్టమైన నాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన ఆ పార్టీ ఇప్పుడు అదే సమస్యపై దిగులు నెలకొంది.  దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్( పెద్దబాస్), కేటీఆర్ (చిన బాస్)లు తమ కంటి చూపుతో పార్టీని శాసించారు. పార్టీ శ్రేణులను పరుగులు తీయించారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధనలో  ఆ పార్టీ సక్సెస్ అయింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి వారిద్దరు రెండు కళ్లుగా నిలిచారు. అదే సమయంలో మాజీ మంత్రి హరీశ్ రావు , ఎంఎల్ సీ కవితలు కూడా పార్టీలో అత్యంత కీలక నేతలుగా కొనసాగారు. వారు నలుగురు చెప్పిందే వేదంగా కొనసాగింది.  అయితే ఇదంతా గతం.  సంవత్సరం క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానప్పటి వరకు ఆ పరిస్థితి కొనసాగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. ఇదే బీఆర్ఎస్ కు వచ్చిన  గడ్డు పరిస్థితి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగినప్పటి నుంచి సీఎంగా బాధ్యతలు స్వీకరించేంత వరకు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై తీవ్ర స్ణాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే గత పదేళ్ల కాలం రాష్ట్రంలో రాజకీయాలు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న చందంగా సాగాయి.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం…కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ పరిస్థితుల్లో ఊహించని మార్పులు వచ్చాయి. పార్టీ ఓటమి చెందడంతో కేసీఆర్ సంవత్సర కాలంగా ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారు. ఇక పార్టీని చక్కపెట్టే బాధ్యతలను పూర్తిగా కేటీఆర్, హరీశ్ రావులపైనే పడింది. ఫాంహౌజ్ నుంచి కేసీఆర్ జారీ చేసిన ఆదేశాలతో వారిద్దరు పార్టీ పరంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ పై అనేక కేసులు నమోదు  అయ్యాయి. ముఖ్యంగా ఫార్ములా ఈ కారు రేసులో  కేటీఆర్ ను ఈడీ, ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక కవిత ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టు అయి కొన్ని రోజుల పాటు జైలులో  ఉన్నారు. తదనంతరం అనంతరం బెయిల్ రావడంతో…… ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో మళ్లీ చురుకుగా కొనసాగుతున్నారు. ఇక హరీశ్ రావు ను సైతం ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతిలో ఏదో ఒక రోజుకు జైలుకు వెళ్ళడం కాయమన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో వారు జైలుకు పోతే పార్టీ పరిస్థితి ఏంటన్న అంశంపై గులాబీ  శ్రేణుల్లో వాడివేడిగా చర్చ సాగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ ను ఏ క్షణంలో అరెస్టు అయినా కావొచ్చు అన్న ఊహాగానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.  అదే జరిగితే  బీఆర్ఎస్‌ను నడిపేదెవరు?  అన్న అంశంపై పలు రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇప్పుడున్న సమయంలో పార్టీని నడిపేదెవరు? హరీష్‌రావు పగ్గాలు అందుకుంటారా? లేక కవిత రంగంలోకి దిగుతుందా? ఇదే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ తర్వాత దాదాపు ఆరునెలలకు బెయిల్ రాలేదు. కేటీఆర్‌కు అదే పరిస్థితి ఎదురవుతుందా? అనే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.  అదే సమయంలో పార్టీకి చెందిన కొందరు నేతలు, శాసనసభ్యులు అప్పుడే పక్క చూపులు చూస్తున్నారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.  కుదిరితే అధికార పార్టీ  లేదంటే బీజేపీకి వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్లు అధికార కాంగ్రెస్ తో ఫైట్ చేయడమంటే ఆశామాషీ కాదని,… దీనివల్ల రాజకీయంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుందన్న ఆందోళన వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ జైలుకి వెళ్లిన మరుక్షణం నేతలు తమ ఇల్లు చక్కబెట్టుకోవడం ఖాయమని అంటున్నారు. 
మళ్లీ మొదలైన కాళేశ్వరం భయం
కాగా కేసీఆర్, హరీశ్ రావులకు తాజాగా  కాళేశ్వరం భయం పట్టుకుందన్న ప్రచారం వినిపిస్తోంది. దీనిపై విచారిస్తున్న జస్తీస్ ఘోష్ కమిటీ త్వరలోనే వారిద్దరికి నోటీసులు ఇచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే మాత్రం పార్టీకి మరిన్ని చిక్కులు ఎదుర్కొవడం ఖాయమని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న  అంశంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిటీనిఏర్పాటు చేసిన విషయం  తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను విచారణకు పిలిచి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోగుట్టును  ఘోష్ కమిటి ఆరా తీసింది. ఇక మిగిలింది కేవలం కేసీఆర్, హరీశ్ రావులు మాత్రమే కావడంతో త్వరలోనే వారికి నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. వారిని కూడా విచారణ చేసి  విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తే మాత్రం…. ఖచ్చితంగా వారిపై పలు రకాల కేసులు నమోదు కావడం తథ్యమని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు పార్టీ శ్రేణులను మరింత కలవరానికి గురి చేస్తోంది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసినా పార్టీని ముందుండి నడిపించేందుకు కేసీఆర్, హరీశ్ రావులు ఉంటారని భావించినప్పటికీ…. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాత్రం వారిని కూడా జైలుకు పంపడం ఖాయమన్న ప్రచారం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగానే వినిపిస్తోంది. ఇది జరిగితే మాత్రం పార్టీ నాయకత్వ మనగడే  ప్రశ్నార్ధకంగా మారుతుందన్న ఆవేదన గులాబీ వర్గాల్లో నెలకొంది.
​ 
రంగంలోకి కేసీఆర్
ఇప్పటి వరకు మౌనంగా ఉన్న కేసీఆర్  పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో పెట్టుకుని నేరుగా రంగంలోకి దిగనున్నారన్న వార్తల సైతం వినిపిస్తున్నాయి. ఫాంహౌజ్ నుంచి పట్టణానికి వచ్చి  పార్టీ శ్రేణులకు అండగా నిలబడాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉంటేనే పార్టీ శ్రేణులకు కొండంత అండ ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ సైతం భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు అయిన మరక్షణం నుంచి కేసీఆర్ నగరంలోనే ఉండనున్నారని తెలుస్తోంది. ఇక ఆ రోజు నుంచి రేవంత్ సర్కార్ పై యుద్దం ప్రకటించాలనే ఆలోచనతో ఉన్నారని  గులాబీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ గులాబీ ప్రస్తుతం రాజకీయంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొందని తెలుస్తోంది. మునుముందు మరిన్ని ఇబ్బందులు కూడా రావడం ఖాయమన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. అదే జరిగితే మాత్రం రాజకీయంగా గులాబీ పార్టీ మరింత నలిగిపోవడం తథ్యమని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.