- నిరుద్యోగ యువతకు రుణ మంజూరు ప్రతాలు.
- ఈ నెల 9 వరకు పంపిణీ చేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.
- ఈ నెల 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో శిక్షణ.
- రాష్ట్రవ్యాప్తంగా 16.22 లక్షల మంది ఎదురుచూపులు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు సమయం ఆసన్నమైంది. పెట్టుబడి సాయం లేక వెనుకబడిన లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభు త్వం రాజీవ్ యువ వికాసం పథకానికి నేడు అంకురార్పణ జరగనుంది.రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం నేడు ఈ పధకాన్ని ప్రారంభించనుంది.ఈ పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు నేటి నుంచి రుణ మంజూరు పత్రాలు జారీకి కాంగ్రెస్ సర్కార్ ఏర్పాట్లు చేసింది. పథకం అమలులో భాగంగా ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు మంత్రులు ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందించనున్నారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుపరచడానికి శిక్షణ కూడా ఇవ్వనుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతనందించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకురాగా ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా యువతి, యువకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. 16.22 లక్షల మంది తమ వ్యాపార ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు సబ్సీడీతో కూడిన పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాదికి ఈ పథకం కింద 5 లక్షల మంది అర్హులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. దీని కోసం రూ.6వేల 2వందల 50 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో జూన్ 2న రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. రూ.50 వేల వరకు వంద శాతం, రూ.లక్ష వరకు 90 శాతం, రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ కింద రుణాలు మంజూరు చేయనున్నారు.
- రాష్ట్రావతరణ వేడుకులకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకల నిర్వహించనున్నారు.రాష్ట్ర రాజధానిలో మాత్రం నాంపల్లి గన్ పార్క్ , సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ తదితర ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి.ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు జపాన్ ప్రతినిధి బృందం ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలోని జపాన్ ప్రతినిధి బృందం ఆదివారమే హైదరాబాద్‌కు చేరుకుంది.నేడు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పరేడ్ గ్రౌండ్స్ వేడుకల్లో వారు పాల్గొంటారు.అలాగే ఈ బృందం ఐటీసీ కాకతీయ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కితాక్యూషూ సిటీతో పరస్పర సహకార ఒప్పందంపై సంతకాలు చేయనుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా కితాక్యూషూ నగరాన్ని సందర్శించారు.అప్పట్లో ఆహ్వానం అందుకున్న మేయర్ ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా హాజరవుతున్నారు.గతంలో అధిక కాలుష్యంతో బాధపడిన కితాక్యూషూ నగరం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి సైతం పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో ఈ ఒప్పందం ద్వారా సహకారం లభించే అవకాశముంది.
- పథకాలు వేగవంతం.
మరోవైపు జూన్ 2న రాష్ట్ర అవతరణ ది నోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించాల ని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. దీంతో పాటు ఇప్పటికే మొదలైన పథకాల్లో వేగం పెంచాలని నిర్ణయించింది.దీని కోసం ప్రత్యేకంగా ‘మిషన్ 26 డేస్” పేరుతో పలు కొత్త పథకాలు, కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తున్నది. లోకల్ బాడీస్ ఎన్ని కలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ యువ వికాసం, గ్రామ పాలనాఅధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు,ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నది. దీంతో పాటు రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకూ నిర్ణయం తీసుకుంది.3వ తేదీ నుంచి రాష్ట్రం వ్యాప్తంగా భూసమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతున్నది.