Take a fresh look at your lifestyle.

శ్రీ పబ్బతి హనుమాన్ దేవాలయంలో పౌర్ణమి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీలో గల శ్రీ పబ్బతి హనుమాన్ దేవాలయంలో చైత్ర పౌర్ణమి, ఉత్తరా నక్షత్రం సందర్భంగా బుధవారం ప్రదోషకాలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను వేదమూర్తులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు మాడభూషి అజయ్ కుమార్ శర్మన్ తెలిపారు.

కందాడై శ్రీనివాసాచార్యుల నేతృత్వంలోని వేద అర్చక బృందం విశ్వక్సేన ఆరాధన, యజ్ఞోపవిత ధారణ, వస్త్ర సమర్పణ, జిలకర బెల్లం, మాంగళ్య పూజ, తలంబ్రాలు, వడి బియ్యం వంటి సంప్రదాయ కళ్యాణ క్రతువులను నిర్వహించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తలంబ్రాలను పంపిణీ చేశారు.

కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు ప్రసాదం మరియు అల్పాహారం పంపిణీ చేయగా, భాస్కర్ రెడ్డి స్వీట్ హౌస్ వారు సేవలందించారు.

ఈ కార్యక్రమంలో అర్చకులు చక్రవర్తి శ్రీనివాస చార్యులు, కందాడై గోపాలచార్యులు, వంగిపురం శ్రావణ్ కుమార్ శర్మన్, శ్రీరంగ సత్యనారాయణ చార్యులు పాల్గొన్నారు. అలాగే సాయి కీర్తన, సత్యలక్ష్మి, సంగీత, పద్మావతి తదితర మహిళా భక్తులు సహా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ఈ నరసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్ పాల్గొని కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు.

Leave A Reply

Your email address will not be published.