Take a fresh look at your lifestyle.

దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు పునఃపరిశీలన చేయాలి: సిపిఐ నేత నారాయణ

చిత్తూరు/నగరి, ముద్ర:
దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ కల్పించలేమని వచ్చిన న్యాయ తీర్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడు డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు.

ఈరోజు చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో క్రైస్తవ మత పాస్టర్లు, సంఘాల పెద్దలు, విశ్వాసులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ క్రైస్తవ పాస్టర్‌పై జరిగిన దాడి కేసులో, దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు వర్తించవని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.

మతం మారినా కులవ్యవస్థ, వివక్ష అంతరించవని, అలాంటి పరిస్థితుల్లో కనీస చట్ట పరిరక్షణను నిరాకరించడం అన్యాయమని నారాయణ పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు ఇచ్చిన మత స్వేచ్ఛ హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలు, కొన్ని సంస్థల ప్రభావంతో ఇటువంటి తీర్పులు వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.

దళిత క్రైస్తవుల హక్కులను పరిరక్షించే దిశగా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, సామాజిక న్యాయం పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.