ప్రజా తీర్పును స్వాగతించి అభివృద్ధికి సహకరించాలి – తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి
ముద్ర, తాండూర్ :
వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ, మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరేయడం చూసి ఓర్వలేక బి ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోజున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్ పర్సన్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, సీనియర్ నాయకులు అబ్దుల్ రహుఫ్, సర్దార్ ఖాన్, ప్రభాకర్ గౌడ్, జుబెర్ లాల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి తాండూర్ ప్రాంత అభివృద్దె లక్ష్యంగా పనిచేస్తున్నారని, అందువల్ల ఏ ఎన్నికల్లో చూసినా తాండూర్ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పైన నమ్మకంతో 19 మంది కౌన్సిలర్లను గెలిపించడం చూసి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కౌన్సిల్లో ప్రతిరోజు కుర్చీ కోసం గొడవలే తప్ప అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపన పోలేదని వారు ఎద్దేవా చేశారు. రెండు మూడు నెలల్లో ఒక్కసారి తాండూర్ ప్రాంతానికి వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే పైన లేని పోనీ ఆరోపణలు చేయడం, శాంతి భద్రతలను కాపాడే పోలీస్ అధికారుల పైన చేయి చేసుకోవడం, అధికారులను బెదిరించడం ఇలాంటి రాజకీయాలు చేయడం లో రోహిత్ రెడ్డి దిట్ట అని వారు పేర్కొన్నారు. కానీ మనోహర్ రెడ్డి మాత్రం అనునిత్యం తాండూర్ ప్రాంత అభివృద్ధి కొరకు, రోడ్లు, డ్రైనేజ్, విద్య వ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అభివృద్ధి సమస్యలపై దృష్టి సారిస్తుంటారని, అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే అలవాటు మనోహర్ రెడ్డి కి లేదని, ఈ విషయాన్ని ప్రతిపక్ష సభ్యులు గ్రహించి తాండూర్ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో చైర్ పర్సన్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.