- వైద్య శాఖలో ప్రతి కార్యక్రమం పై అవగాహనతో అమలు చేయాలి
- పాఠశాలల్లో అవసరమైన మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలి
- పి.ఏ.సి.ఎస్ వద్ద యూరియా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి
- ఓదెల మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
ఓదెల, ముద్ర: నిర్దేశిత పనులను మండలాల్లో ప్రతి అధికారి సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.ఓదెల మండలం కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలనూర్,నాంసాని పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పోత్కపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వ్యవసాయ సహకార సంఘం, ఓదెల మండల కేంద్రంలోని కేజీబీవీ,ఎంపిడిఓ,తహసిల్దార్ కార్యాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లను కలెక్టర్ తనిఖీ చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ,ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్.సి.డి సర్వే పూర్తి చేయాలన్నారు.వైద్యశాఖ పరిధిలో చేపట్టే ప్రతి కార్యక్రమంపై ఆశాలకు సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు.టీబీ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్స్ రే తీయించాలన్నారు.ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ మహిళలను రెగ్యులర్ గా మానిటర్ చేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పోషక లోపంతో ఉన్న విద్యార్థులను మానిటర్ చేస్తూ వారి ఎదుగుదలకు కృషి చేయాలని, ఆర్.బి.ఎస్.కే ద్వారా పరీక్షల నిర్వహించి ఆసుపత్రికి రిఫర్ అయిన పిల్లల ఆరోగ్య పరిస్థితులను రెగ్యులర్ మానిటరింగ్ చేయాలన్నారు.
పాఠశాలల తనీఖీలలో కొలనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంజూరు చేసిన పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు.నాంసానిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వరద నీరు నిలవకుండా ముందు ప్లాట్ఫారం నిర్మించాలని, పోత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డయాస్ నిర్మాణం,ఇతర మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. ఓదెల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రెండు అదనపు తరగతి గదులు, అవసరమైన టాయిలెట్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.ఓదెల ఎంపీడీవో కార్యాలయంలో త్రాగునీటి సరఫరా అధికారులతో కలెక్టర్ సమీక్షించి రాబోయే వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు.జిల్లాలో అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని, పోత్కపల్లి వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైతే ఇండెంట్ పెట్టి జిల్లా నుంచి తెచ్చుకోవాలని,రైతులకు యూరియా గురించి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని,ఈ- పాస్ యంత్రాల ద్వారా పారదర్శకంగా యూరియా విక్రయం జరగాలని కలెక్టర్ తెలిపారు.ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ సునీత, ఎంపీడీవో తిరుపతి, ఎంఈఓ రమేష్, ఏఈ పి ఆర్ జగదీష్, మండల వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సంజనేష్ కుమార్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.