Take a fresh look at your lifestyle.

సరస్వతీ పుష్కరాల ప్రాతినిధ్యం నా అదృష్టం

  • రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.
  • 40 కోట్లతో అన్ని ఏర్పాట్లు.
  • ఏకశిలా సరస్వతీ విగ్రహం ఏర్పాటు.
  • 30 లక్షల మంది పుణ్యస్నానాలు.
  • విజయవంతమైన పుష్కరాలు.

మహదేవపూర్, ముద్ర విలేఖరి: గోదావరి, ప్రాణహిత, అంతరవాహిని సరస్వతి సంగమంలో మొట్ట మొదటిసారిగా పుష్కరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భగవంతుడు పుష్కరాలను నిర్వహించే అవకాశం కల్పించాడని 40 కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సరస్వతి మాత 17 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. దాదాపు 30 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని, ఈ ప్రాంతానికి అన్ని లక్షల మంది ఎన్నడూ రాలేదని తెలిపారు. పన్నెండు రోజుల నుండి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పనిచేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.15 నుండి 26 వరకు జరిగిన పుష్కరాలకు ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించారని అభినందించారు. ఎన్నికల నిబంధనలు వల్ల పనులు చేపట్టేందుకు కొద్దిగా ఇబ్బంది కలిగినా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం తక్కువ సమయంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు నిర్వహించిన పుష్కరాలు దిగ్విజయం అయ్యాయని తెలిపారు. వర్షం వల్ల కొద్దిపాటి అంతరాయం ఏర్పడినా భక్తులకు ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. స్వచ్చంద సంస్థలు భక్తులకు మంచినీరు, అన్నదానం చేసారని అభినందించారు. రాబోవు గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా జరుపుతామని అన్నారు. తెలంగాణలో ఎప్పు డు ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని తెలిపారు. కాశీ పండితులు ప్రతి రోజు సరస్వతి నవరత్న మాలా కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. మీడియా ద్వారా లక్షలాది మంది భక్తులు పుష్కరాలకు వచ్చేలా ప్రచారం జరిగిందని, టివి ఛానళ్ల ద్వారా వీక్షించే అవకాశం కల్పించారని అభినందించారు. ప్రభుత్వ శాఖల సమన్వయం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మణోత్తములు ప్రతి రోజు వేద మంత్రాలతో పూజాదికాలు నిర్వహించారని వారిని అభినందించారు. పుణ్య స్నానాలు సంవత్సరం పాటు చేసేందుకు అవకాశం ఉందని, రాలేని భక్తులు సంవత్సర కాలంలో ఎపుడైనా పుష్కర స్నానాలు చేయొచ్చని తెలిపారు.


సరస్వతి పుష్కరాల నిర్వహణ కోసం అహర్నిశలు కృషిచేసిన అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా తక్కువ సమయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేక చొరవతో ముందస్తు ప్రణాళికల ద్వారా అధికారులకు సూచనలు జారీ చేస్తూ సలహాలు తీసుకుంటూ అందుకు అనుగుణంగా సరస్వతి పుష్కరాలు విజయవంతానికి కృషి చేశారని అభినందించారు. రానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వత సదుపాయాలు కల్పిస్తామని, పుష్కరాల ముగింపు సందర్భంగా చిరుజల్లులు కురవడంతో ఆ దేవతల అనుగ్రహం అందరిపై ఉందని అన్నారు.శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం చిన్న గ్రామమని ఈ గ్రామంలో ఇంత గొప్ప మహా సరస్వతీ పుష్కరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ అన్నారు. 5 నెలల ముందు నుండి ప్రణాళికలు సిద్ధం చేశామని అందుకు అనుగుణంగా ప్రభుత్వం 40 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని, వాటి ద్వారా భక్తులకు సౌకర్యాలు కల్పన చేశామని అన్నారు. పుష్కరాల నిర్వహణకు సహకరించిన స్థానిక ప్రజలకు, అధికారులకు క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సరస్వతి పుష్కరాలు మొదటి 12 రోజులు ఆది ఆరంభమని, సంవత్సర కాలం పొడవున ఈ సరస్వతీ పుష్కరాలు కొనసాగుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పద్మశ్రీ నాగఫణి శర్మ, ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మదన్ మోహన్, మక్కన్ సింగ్, ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు.అనంతరం సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం వీక్షించారు.

Leave A Reply

Your email address will not be published.