ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
మే 13న నిర్వహించనున్న పాలిసెట్-2026 పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పాలిసెట్ కన్వీనర్ మదన్ మోహన్ తెలిపారు.

సోమవారం నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అబ్సర్వర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొత్తం 2,911 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పాలిటెక్నిక్ కోర్సులపై విద్యార్థుల్లో ఆదరణ పెరిగిందన్నారు.
విద్యార్థుల సౌకర్యార్థం జిల్లాలో మొత్తం 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో 8 కేంద్రాలు జిల్లా కేంద్రంలో ఉండగా, బిజినపల్లి మండలం పాలెంలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలను జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా సులభంగా గుర్తించి చేరుకోవచ్చని పేర్కొన్నారు.
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. తాగునీటి వసతి, వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు హెచ్‌బీ పెన్సిల్, ఎరేజర్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అబ్సర్వర్‌లు పాల్గొన్నారు.