ముద్ర, కోరుట్ల;
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం గ్రామపంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి. సౌజన్య మాట్లాడుతూ వరి పంటకు యూరియాని సిఫారసు మేరకు మాత్రమే వాడాలని, చేస్తున్నట్లు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, రైతులు పంట మార్పిడిని కొనసాగించాలని, మార్కెట్ లో గిరాకీ ఉన్న వరి రకాలు పండించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయాన్ని కొద్ది భాగంలో అయినా సాగుచేయాలని, అలాగే నీటి యాజమాన్యం పై అవగాహన కల్పించారు. అలాగే వరిలో పంట అవశేషాలను తగులబెట్టకుండా కలియదున్నాలని సూచించారు. యూరియా బుకింగ్ యాప్ గురించి అలాగే రైతులు లోతు దుక్కులు చేసుకుంటే కలిగే లాభాలు వివరించారు. కూరగాయల సాగు, మల్చింగ్ సబ్సిడీలు ఆయిల్ పామ్ సాగు, మార్కెటింగ్ అలాగే సబ్సిడీల పై అవగాహన కల్పించారు. రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పి. అంజిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి నాగమణి, హెచ్ ఈ ఓ బి అన్వేష్, ఏఈ వోలు ఆర్. శ్రీహరి, పి. నరేష్ ఆత్మ మెంబెర్ జి. హనుమక్క, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.