Take a fresh look at your lifestyle.

అందరి సహకారంతో నిర్మల్ అభివృద్ధికి కృషి -చైర్ పర్సన్ గా అప్పాల కావ్య

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాజకీయాలకు అతీతంగా నిర్మల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని నిర్మల్ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య పేర్కొన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో 42 వార్డుల నుండి గెలుపొందిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గా అప్పాల గణేష్ చక్రవర్తి లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య మాట్లాడుతూ నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తానని అన్నారు. పట్టణంలోని 42 వార్డులలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల కతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని, సమన్వయంతో ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తనకు పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, ప్రజలు, అధికారులు సహకరించాలని కోరారు.

భార్యాభర్తలే చైర్మన్, వైస్ చైర్మన్లు

నిర్మల్ మున్సిపల్ చరిత్ర తిరగరాశారు.ఎన్నడూ లేని విధంగా భార్య, భర్తలే చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న అప్పాల కుటుంబం ఆది నుండి నిర్మల్ మున్సిపాలిటీ పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. తాత నుండి మనవడి వరకు మున్సిపాలిటీ చైర్మన్ లు గా ఆ కుటుంబం నుండి పనిచేసిన వారే. తాజాగా సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అప్పాల కావ్య, అప్పాల గణేష్ చక్రవర్తులు చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.

పలువురి ప్రశంసలు

నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గా ఎన్నికైన అప్పాల గణేష్ చక్రవర్తిని పలువురు పట్టణ ప్రజలతో పాటు ప్రముఖులు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి వేణుగోపాల చారి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ లతోపాటు పలువురు అభినందించిన వారిలో ఉన్నారు.

భారీగా తరలిన జనం

నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పట్టణ ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం బయటకు వచ్చిన నాయకులకు ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో పట్టణ పోలీసులు వారి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.