ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను వికారాబాద్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈద్ అల్ ఫితర్ పర్వదినం సందర్భంగా శనివారం అలంపల్లి దర్గాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపారు.

మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలతో వేలాదిమంది ముస్లిం సోదరులు రంజాన్ పండుగ పవిత్రతను చాటి చెప్పారు. రంజాన్ సందర్భంగా గంగారం పట్టణంలోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్ధనలకు వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు ధరించి, భక్తిభావంతో ప్రార్థనలకు వచ్చారు. ఈ ప్రార్థనలలో మత గురువులు మత పెద్దలు, ముత్తువలిలు రంజాన్ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి బోధనలు నిర్వహించారు. పట్టణం ఈద్గా వద్ద ప్రార్థనల నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలో కౌన్సిలర్లు, నాయకులు, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం వారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా ఈద్గా మైదానం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య, కౌన్సిలర్లు లక్ష్మికాంత్ రెడ్డి, నాయకులు కిషన్ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.