Take a fresh look at your lifestyle.

కేసీఆర్ కు కిషన్ రెడ్డి ద‌త్త‌త పుత్రుడిగా మారారు-నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కు రక్షణ కవచంగా కిషన్ రెడ్డి
కేసీఆర్ కు ఆయన ద‌త్త‌త పుత్రుడిగా మారారు
గులాబీ బాస్ ను కేసుల నుంచి తప్పిస్తున్నాడు
కేసీఆర్ ను శిక్షించాలన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏ బొక్క‌లో దాక్కున్నారూ…?
కేసీఆర్, హరీశ్ రావుకు జైలు శిక్ష పడేలా చూస్తామని తప్పించుకుంటున్నారు
వారిని చ‌ర్ల‌పల్లి జైలులో పెట్ట‌కుండా ఎవ‌రు అడ్డుకుంటున్నారూ..?
బీజేపీ, బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్టే
నిజామాబాద్ కు ఎయిర్ పోర్టు తీసుకువ‌స్తా
బీజేపీకి రాష్ట్రంలో ఎక్కడా ఓటు అడిగే అర్హత లేదు
నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, నిజామాబాద్ :

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… మాజీ సీఎం కేసీఆర్ కు రక్షణ కవచంలా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ద‌త్త‌త పుత్రుడిగా మారి గులాబీ బాస్ ను కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కిష‌న్ రెడ్డి క‌ల్వ‌కుంట్ల కిష‌న్ రావు గా మారారని ఎద్దేవా చేశారు. కిష‌న్ రెడ్డిని జ‌న‌జీవ‌న‌ స్ర‌వంతిలోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు సూచించారు. మీ ప‌క్క‌న కూర్చున్న కిష‌న్ రెడ్డి కేసీఆర్ ను ఎందుకు కాపాడుతున్నాడో సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరం అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హ‌రీస్ రావును కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎప్పుడు అరెస్ట్ చేస్తాయో బీజేపీ నాయ‌కులు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్, హ‌రీష్ రావును జైలు లో పెట్టి చిప్ప కూడు తినిపించాల‌ని చెబుతోన్న నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్… తన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరపడంతో పాటు ఆ నివేదికపై శాస‌న‌స‌భ స‌భ‌లో చ‌ర్చ పెట్టి దాన్ని సీబీఐకి ఇచ్చామన్నారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు సీబీఐ ప‌ట్టించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావుకు జైలు శిక్ష పడేలా చూడాల్సిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏ బొక్క‌లో దాక్కున్నారని నిలదీశారు. వారిని చ‌ర్ల‌పల్లి జైలులో పెట్ట‌కుండా ఎవ‌రు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో ధ‌ర్మ‌పురి అర్వింద్ ఎందుకు మాట్లాడ‌డం లేదన్నారు. కిష‌న్ రెడ్డి కేసీఆర్ ను ఏ ర‌కంగా కాపాడుతున్నాడో తెలియ‌డం లేదా..? అని చురకలంటిచారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తే ఆరు నెలల క్రితమే తాము అసెంబ్లీలో తీర్మాణం చేశామన్నారు. అయినా ఇంత వరకు బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ధర్మపురి అర్వింద్‌ను ప్రశ్నించారు. సీబీఐకి ఇస్తే.. కేసీఆర్‌ను 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్న కిషన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నాడని మండిపడ్డారు. ధర్మపురి అర్వింద్‌కు ప్రధాని మోడీ దగ్గర పరపతి లేదు. ఆయనతో జిల్లాకు కూడా ఏం ఉపయోగం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే.. అది తప్పకుండా వృథా అవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గాడిదకు గడ్డి వేసి.. ఆవుకు పాలు పిండితే ఎలా వస్తాయని అడిగారు. మన బస్తీ, మన కాలనీ అభివృద్ధి జరుగాలంటే మనోడే గెలవాలని అన్నారు.నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు గెలిచిన ధర్మపురి అర్వింద్.. తన నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ గ‌ల్లీలో మోరీలు తీయాలంటే మోదీ అవ‌స‌ర‌మా..? అని సెటైర్లు వేశారు. స్మార్ట్ సిటీ చేయలేకపోయిన బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. ధర్మపురి అర్వింద్‌తో పాటు మొత్తం బీజేపీ ఎంపీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. నిజామాబాద్ ప్రజలు అర్వింద్ కు ఓట్లు వేసి గెలిపిస్తే.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయాడని విమర్శించారు. ధర్మపురి అర్వింద్‌తో సహా ఏ ఒక్క బీజేపీ ఎంపీకి కూడా కేంద్ర నేతల దగ్గర బలంగా మాట్లాడే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ నిధులు కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ శాఖ మంత్రినైనా తన ద‌గ్గ‌ర‌కు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ నిధులు ఇచ్చే బాధ్య‌త తనదన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేసే బాధ్య‌త కూడా తనదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు మ‌నోళ్లు గెల‌వాలనీ అప్పుడే ప‌నులు జ‌రుగుతాయన్నారు. బంగారం లాంటి అవ‌కాశాన్ని నిజామాబాద్ ప్ర‌జ‌లు వ‌దులుకోవ‌ద్దని కోరారు. నిజామాబాద్ లో కాంగ్రెస జెండా ఎగ‌రాల్సిందేనన్నారు. కార్పొరేష‌న్ లో బీజేపీ ఓట్లు అడ‌గాలంటే నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ గా ప్ర‌క‌టించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటు అడిగే హ‌క్కు బీజేపీ కి లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీని బొంద పెట్టాల్సిందేన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేసినా, బీఆర్ఎస్ కు ఓటు వేసినా ఓటు మూసీలో వేసిన‌ట్లేనని ఎద్దేవా చేశారు. వ‌రంగ‌ల్, ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్టు తెచ్చామన్న సీఎం.. నిజామాబాద్ కు ఎయిర్ పోర్టు తీసుకువ‌చ్చే బాధ్య‌త తమదేనన్నారు.

రేవంతుద్దీన్ అని పిలిచినా అభ్యంతరం లేదు
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తనను రేవంతుద్దీన్ పేరుతో పిలిచారని సీఎం చెప్పారు. అలా పిలిచినా తనకు ఎలాంటి అభ్యంత‌రం లేదన్నారు. అన్నికులాలు,మంతాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని అభివృద్ధి ప‌థం వైపు తీసుకువెళ్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తెలంగాణ‌ను అన్ని రంగాల్లో నెంబ‌ర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తానని చెప్పారు. బ్రిటిష్ దొరల పాలన త‌ర్వాత వందేళ్ల వ‌ర‌కు బీసీ కుల‌గ‌ణ‌న జ‌ర‌గ‌లేదన్న సీఎం.. కుల‌గ‌ణ‌న చేసినందుకు గ‌తంలో మ‌హేష్ కుమార్ గౌడ్ తనను రేవంత్ గౌడ్ అని పిలిచిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో తాను దాన్ని సంతోషంగా స్వీక‌రించానని చెప్పారు. ఆ తర్వాత ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపిన తర్వాత మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా తనను రేవంత్ మాదిగ అని సంభోదించారన్నారు. దానికీ తాను సంతోషపడ్డానన్నారు. పార్టీలో 30 ఏళ్లు కాంగ్రెస్ కార్య‌క‌ర్త గా ప‌ని చేసిన వాకిటి శ్రీహ‌రిని మంత్రి ని చేస్తే ముదిరాజ్ వ‌ర్గం తనను రేవంత్ ముదిరాజ్ అని వ్యాఖ్యానించిందన్నారు. అనిల్ కుమార్ యాద‌వ్ ను రాజ్య‌స‌భ కు పంపిస్తే తనను రేవంత్ యాద‌వ్ అని పిలిస్తే సంతోష‌ప‌డ్డానన్నారు. స్వ‌ర్ణ దేవాల‌యాన్ని నిర్మిస్తాన్నందుకు స‌ర్దార్ రేవంత్ సింగ్ అని న‌న్ను సిక్కు సోద‌రులు పిలిచారన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా పిలిచినా తాను పాజిటివ్ స్వీకరించి ముందుకు వెళ్తానన్నారు. అన్ని కులాలు మతాలు తనకు సమానం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.