ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ,పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఇటీవల విధి నిర్వహణలో మరణించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఆర్ధిక సాయం అందజేసింది. దీంతో పాటు గతేడాది అక్టోబరు డ్యూటీ చేస్తుండగా దుండగుల చేతిలో కత్తి పోటుకి గురై మృత్యవాత పడిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్-గ్రేషియా ఇచ్చింది. ఈ సహాయానికి సంబంధించిన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిజామాబాద్‌లో ఆ కుటుంబాలకు స్వయంగా అందజేశారు. గతనెల 23న నిజామాబాద్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సౌమ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ నిమ్స్‌లో సౌమ్యకు చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ప్రభుత్వం మృతురాలీి కుటుంబానికి అండగా నిలిచింది.