Take a fresh look at your lifestyle.

ప్రణాళికబద్దంగా పాలమూరు అభివృద్ధి – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………….
ప్రణాళికబద్దంగా పాలమూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో సమగ్ర, ప్రణాళికాబద్ధమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
ఈ రెండున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మహబూబ్‌నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కాలేజీలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు, ట్రిపుల్ ఐటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ఎన్నో ఉత్తమ విద్యాసంస్థలు పట్టణానికి తెస్తున్నాం అని, కొత్తగా వచ్చే విద్యా సంస్థల ద్వారా ఇతర జిల్లాల నుంచి విద్యార్థుల రాక పెరిగి, రెంటల్ హౌసింగ్, చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. తాగునీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్లు,అర్బన్ ప్లానింగ్ రంగాలలో సమగ్ర ప్రణాళికలు చేపడుతున్నామన్నారు. మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి అసెంబ్లీ లో బిల్లు పెట్టి పాస్ చేయించామని, దీని ద్వారా పట్టణంలో పెద్ద స్థాయి అభివృద్ధి జరగడమే కాకుండా ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సైతం సులభంగా లభించే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చెందిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధిక నిధులు పొందే మార్గం సుగమం అయిందన్నారు . ప్రస్తుతం మహబూబ్‌నగర్ జనాభా దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.220 కోట్ల వ్యయంతో వాటర్ ఆగ్మెంటేషన్ స్కీమ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, పట్టణంలో 14 రిజర్వాయర్ల నిర్మాణం 18.6 మిలియన్ లీటర్ల అదనపు నీటి నిల్వ సామర్థ్యం , 40 కిలోమీటర్ల ఫీడర్ పైప్లైన్లు , 209 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రాంత ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పట్టణంలోని పలు కాలనీల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో పలు సమస్యలుఎదురవుతున్నాయని, దానికి కారణం అనియంత్రిత లేఅవుట్లు, ఆక్రమణలే కాకుండా చిన్న రహదారులు సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని, ఈ సమస్యలకు పరిష్కారం కోసం రూ.600 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ కు ముఖ్యమంత్రి చేత గతంలో శంకుస్థాపన చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పట్టణానికి దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందన్నారు. పట్టణం చుట్టూ రింగ్ రోడ్ల నిర్మాణాలు, నేషనల్ హైవే కనెక్టివిటీ విస్తరణ, బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానం, ఎకనామిక్ కారిడార్‌లో భాగస్వామ్యం, ఇవి నగరాన్ని లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దనున్నాయని ఆయన చెప్పారు. కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ అవసరం ఉన్నందున ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన పరిహారం అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు ఎస్.శేఖర్ , పెద్ద గొల్ల నర్సింహులు, రమేష్ రెడ్డి,కిషన్ నాయక్, విఠల్ రెడ్డి , యాదగిరి, నాయకులు శాంతన్న యాదవ్, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.