Take a fresh look at your lifestyle.

గ్రామాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం బసంతాపూర్ గ్రామంలో నిన్న రాత్రి పులి దాడిలో మృతి చెందిన లేగ దూడ సంఘటన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…ఇటీవల గ్రామాలలో పులి సంచరిస్తున్నందున పులిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాల పై అటవీ అధికారులతో కలెక్టర్ చర్చించారు. అటవీ అధికారులు పులిని పట్టుకోవడానికి ధర్మల్ డ్రోన్ ను ఉపయోగించి పులి సంచరిస్తున్న ప్రదేశాలను వీడియో తీయడం ,ట్రాప్ కెమెరా, పులిని బంధించడానికి బోన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అటవీ శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. ప్రత్యేకంగా అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని తెలిపారు.రాత్రి వేళలో పశువులను బయటికి వదలకుండా పశువుల పాకలో వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. పులి కనిపించినట్లు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా స్థానిక గ్రామ పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు.వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయరాదని అన్నారు. జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ సిబ్బంది పులి అడుగు జాడలను గమనిస్తూ, దాని పట్టుకోవడానికి, అడవిలోకి పంపడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు భయాందోళన నకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.