ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకనుగుణంగా పని చేయండి ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి ప్రభుత్వం, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలెక్టర్లకు సూచించారు. విధి నిర్వహణలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో ఉండాలన్నారు.
ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ తదితర జిల్లా కలెక్టర్లు మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఈ సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి చేర్చవలసిన బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఎంతో ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల అవసరాలను అర్థం చేసుకొని పని చేయాలని కలెక్టర్లకు దిశ నిర్దేశం చేశారు. ఐఏఎస్ అధికారుల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పని చేయటమే అత్యంత కీలకమైన అవకాశమని అన్నారు. ప్రజలతో మమేకం కావాలని, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతో పాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని, జిల్లాల్లో పని చేసిన అనుభవమే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజాపాలనలో ప్రజాకేంద్రంగా పాలన సాగాలని , ప్రజలకు మేలు చేసే పనులనే జిల్లా పాలకులుగా చేపట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలుచేసి అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించవలసిన బృహత్తర బాధ్యత కలెక్టర్లదేనన్నారు.