- శిక్ష పూర్తయ్యలోపు తీర్చి దిద్దేందుకు కృషి.
- ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా తెలంగాణ జైళ్ల శాఖ.
- ఖైదీల వార్షిక క్రీడలు, సాంస్కృతిక పోటీలు – 2025″ ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు.
ముద్ర. తెలంగాణ బ్యూరో : శిక్ష పూర్తయ్యేలోపు ఖైదీల్లో మార్పు తీసుకొచ్చి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చర్లపల్లి సెంట్రల్ జైల్లో నిర్వహించిన “ఖైదీల వార్షిక క్రీడలు, సాంస్కృతిక పోటీలు – 2025″(Annual Prisoners sports & Cultural Meet – 2025) ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై..విజేతలకు బహుమతులు అందజేశారు.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ జైళ్ల శాఖ అమలు చేస్తున్న సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. తెలిసో తెలియకో చేసిన తప్పులకు శిక్షను అనుభవిస్తున్న ఖైదీల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు అనేక చేతి వృత్తులు, ఇతర పనుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. ఖైదీలు మానసిక ఒత్తిడికి గురి కాకుండా నిపుణులతో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామన్నారు. ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, ఆ దిశగా వారిని మరింత ప్రోత్సహిస్తామన్నారు. జైలుకు కావాలని ఎవరూ రారని,బయటకు వెళ్లిన తర్వాత మరోసారి అలాంటి తప్పు చేయకుండా గౌరవంగా జీవించాలని ఖైదీలకు సూచించారు. సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు ప్రభుత్వం తరఫున వీలైనంత వరకు అండగా ఉంటామన్నారు.శిక్ష అనుభవించే సమయంలో ఆందోళనకు గురి కావొద్దని, అలాగే కాలాన్ని వృథా చేయకుండా ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ పొందాలని సూచించారు.ఒకవేళ ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే నిబంధనల ప్రకారం జైళ్ల శాఖ తరఫున సహకరిస్త మన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
