– కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన రెండో అంతస్తు నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించిందని ఆయన తెలిపారు.

గత మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి బాధ్యతను స్వయంగా తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఆ హామీ ప్రకారం 100 రోజుల్లోనే రూ.840 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో పాటు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సహా అధికారులు వేగంగా ప్రతిపాదనలు రూపొందించి ఢిల్లీకి పంపినట్లు తెలిపారు. 48 గంటల్లోనే ఢిల్లీలో సమావేశం నిర్వహించి కేంద్ర బృందాన్ని కరీంనగర్‌కు పంపించారని ఆయన గుర్తు చేశారు.
యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్ ఉండదని కొందరు అధికారులు చెప్పినా, పట్టుదలతో కేంద్ర పెద్దలను ఒప్పించి జాబితాలో చేర్చించానని బండి సంజయ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 17 ప్రాజెక్టులకు మాత్రమే ఆమోదం లభించగా అందులో కరీంనగర్ కూడా ఉండటం గర్వకారణమని అన్నారు.
యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ రూపురేఖలు మారబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. డంపింగ్ యార్డు అభివృద్ధికి రూ.80 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. గతంలో స్మార్ట్ సిటీ కింద రూ.900 కోట్లు, అమృత్-1, అమృత్-2 పథకాల ద్వారా రూ.277 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
శివారు ప్రాంతాల అభివృద్ధి, పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. తన ఏడేళ్ల ఎంపీ పదవీకాలంలో రూ.20 వేల కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
శాతవాహన కాలేజీకి 12బి హోదా, లా కాలేజీ మంజూరు, ఎస్సారార్ కాలేజీకి అటానమస్ హోదా, అంబేద్కర్ స్టేడియం, జమ్మికుంట స్టేడియం అభివృద్ధికి నిధులు వంటి అనేక ప్రాజెక్టులను గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సిఎస్‌ఆర్ నిధులు వినియోగించినట్లు తెలిపారు.
త్వరలో టెన్త్ విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించనున్నట్లు కూడా ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే మోడల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.
కేంద్ర పారామిలటరీ గ్రూప్ సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 14 ఎకరాలు కేటాయించిందని, దీనికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఎన్నికల తరువాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువస్తానని ఆయన స్పష్టం చేశారు.