Take a fresh look at your lifestyle.

కూకట్‌పల్లిలో విషాదం రోడ్డుపై వ్యక్తి ఆకస్మిక మృతి

 

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి, ఫిబ్రవరి 22:

స్థానిక శ్రీ సాయిరాం గోల్డ్ షాపు సమీపంలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన కొమ్మినేని నరసింహారావు చౌదరి (48)గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. నరసింహారావు గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. 2011లో కార్యాలయంలోనే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆరోగ్యం దెబ్బతింది. ఆ తర్వాత భార్య విడాకులు తీసుకోవడంతో మానసికంగా కుంగిపోయిన ఆయన మద్యానికి బానిసయ్యారు. కూకట్‌పల్లిలో ఒంటరిగా ఉంటూ రోడ్ల పక్కన కాలం గడిపేవారు.
శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో గోల్డ్ షాప్ ముందు పడుకున్న నరసింహారావు, ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చి కూర్చున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వెనక్కి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.