Take a fresh look at your lifestyle.

ఎన్నికల బదిలీ బాధిత తహసీల్దార్లకు మోక్షమెప్పుడు?

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అస్మదీయులైతే ఎక్కడ ఉన్నా అన్నీ అందుతాయి, కానివారైతే అందినవి కూడా జారిపోతాయి అన్న సామెత అక్షరాల రెవెన్యూ శాఖ కు వర్తిస్తుంది. ఆ శాఖకు చెందిన పలువురు గెజిటెడ్ ఉద్యోగులు 2023 ఎన్నికల సమయంలో సొంత జిల్లాలో పని చేయరాదన్న నిబంధనలతో పొరుగు జిల్లాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. రెండేళ్లు పూర్తవుతున్నా సొంత జిల్లాకు బదిలీ పై నిబంధనలు అమలు చేస్తున్నారన్న ఆవేదన పలువురు తహసీల్దార్లు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు తహసీల్దార్లను స్వంత జిల్లా అయినా,3 సంవత్సరాలు ఒకే జిల్లాలో పనిచేసినా అలాంటి తహసీల్దార్లను ఎలక్షన్ కమీషన్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం 2023 ఆగస్టు లో ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. ఎన్నికల అనంతరం తిరుగు బదిలీలు కోరినా సొంత జిల్లా అనే వంకతో బదిలీలు చేయలేదు. ఐతే జిల్లా స్థాయి అధికారులు మాత్రం 3 నుండి 5 మంది తహసీల్దార్లను స్వంత జిల్లాలో, కలెక్టర్ కార్యాలయంలో పనిచేసేలా ప్రభుత్వ అనుమతితో బదిలీ కాకుండా చూసారు. కాగా ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ అయినవారు తిరుగు బదిలీలను చేపట్టాలని, కుటుంబాలకు దూరంగా పనిచేయడం ఇబ్బందిగా ఉందని ఉద్యోగుల సంఘం ట్రెసా ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికలకు ముందు సొంత జిల్లాలో ఉన్నవారు ఇప్పటివరకు అక్కడే పని చేస్తున్నారు. ఐతే వీళ్లు మాత్రం సొంత జిల్లాలో పనిచేస్తే ప్రభుత్వానికి లేని ఇబ్బంది, బదిలీ చేసిన వారు చేస్తే ఎందుకో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు తహసీల్దార్ కేడర్లో పనిచేస్తుండగా ఒకరు తహసీల్దార్ గా, మరొకరు కలెక్టర్ కార్యాలయ ఏ ఓ గా, ఇంకొకరు డీఆర్డీఏ లో పనిచేస్తున్నారు. మరో నలుగురు సొంత జిల్లాకు సంబంధించిన డిప్యూటీ తహశీల్దార్లు తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా తమ ఆవేదన అర్థం చేసుకుని సొంత జిల్లాలకు బదిలీ చేయాలని బాధిత తహసీల్దార్లు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.