ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర మార్గదర్శకత్వంలో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య మంగళవారం సంగారెడ్డిలోని గ్రేస్ ఓల్డ్ ఏజ్ హోమ్,భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ,భరోసా కేంద్రాన్ని సందర్శించే బాధితులకు తక్షణమే న్యాయపరమైన సూచనలు, సలహాలు అందించాలని తెలిపారు. పోక్సో చట్టం మరియు మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన న్యాయ సహాయం అందించాలని సూచించారు. లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
అలాగే వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి, వారి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్యం,సంక్షేమంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
భరోసా కేంద్రానికి వచ్చే బాధితుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా న్యాయ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,సంగారెడ్డి కార్యాలయాన్ని సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు.
ఈకార్యక్రమంలో భరోసా కేంద్రం అధికారులు,ఓల్డ్ ఏజ్ హోమ్ అధికారులు,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.