Take a fresh look at your lifestyle.

మురళీకృష్ణుడుగా శ్రీ లక్ష్మీ నరసింహుడు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఆదివారం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామివారిని శ్రీకృష్ణాలంకారము ( మురళీకృష్ణుడు) అలంకార శేవలో అలంకరించి భక్తుల దర్శనార్ధం తిరువీధులలో ఊరేగింపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలను శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా ఆలయప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చకబృందం, పారాయణీకులు అత్యంతవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె. భవాని శంకర్, ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, జిల్లా కలెక్టర్ ఎమ్. హనుమంతరావు శ్రీ స్వామివారి అలంకార సేవను మోశారు. అనంతరం అర్చక స్వాములు శ్రీకృష్ణ అలంకారం యొక్క విశిష్టతను శ్రీ స్వామివారి కల్యాణ మండపం వద్ద భక్తులకు వివరించారు.

శ్రీకృష్ణాలంకారము (మురళీకృష్ణుడు )అలంకార విశిష్టత

భగవానుని దశావతారాలలో శ్రీకృష్ణ అవతారము ఎన్నో విశేషములతో కూడినది. శ్రీకృష్ణ భగవానుడు మురళీకృష్ణుడిగా (వేణుగోపాల స్వామి) జగత్ ప్రసిద్ధమైన తత్త్వమిది. వేణునాదము వేదనాదమని వైకుంఠంలోని తత్త్వమున కంటే ఆనందకరమైనదని భగవానుడు బృందావనంలో వినిపించే వేణునాదం అన్ని లోకాలను మైమరపింప చేస్తూ ఉందని మహర్షులు పొందిన ఆనందము మాటలకు అందనిదని భాగవతం చెబుతుంది.
సామాన్యులు మొదలు బ్రహ్మాది దేవతల నిర్యంతము సమ్మోహన పరచిన ఈ వేణువు యొక్క వృత్తాంతమును స్మరిస్తే సర్వస్వము త్యజంచి భగవానుని శరణు వేడిన తీరు ముక్తి ప్రదమని స్పష్టంగా కనిపిస్తున్నది వేణుగానం వినడం మురళీకృష్ణుడిని దర్శించడం కన్నులకు చెవులకు ఇంద్రియములన్నింటికీ కూడా ఉపశమనమని లీలాశుకులు అంటారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మురళీకృష్ణుడు అలంకారంలో భక్తకోటిని అనుగ్రహించుట విశేషమై యున్నది.

సాయంకాలం పొన్న వాహన శేవలో స్వామివారు

ఆదివారం సాయంకాలం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం రాత్రి శ్రీ స్వామి వారిని పొన్నవాహన శేవలో అలంకరించి భక్తుల దర్శనార్ధం తిరువీధులలో ఆలయప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవముగా ఊరేగింపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పొన్న వాహన శేవ ప్రత్యేకత

దేవతా వృక్షముగా ప్రసిద్ధి పొందిన వృక్ష రాజములలో అత్యంత శ్రేష్టమైనది పొన్నవృక్షము. భగవానుడికి కూడా నిత్య నివాస స్థానముగా ప్రసిద్ధి పొందినది ఈ పొన్నవృక్షమే. ఈ పొన్నవృక్షము ఆశ్రితులకు కల్పతరువై వారియొక్క అనేక విధములైన కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది. భగవానుడు సత్పురుషులకు నివాస వృక్షముగా ఉండునని వేదవాక్యము. అదియే ఈ పొన్నవాహన సేవలోని అంతరార్ధము. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య వైభవ ఉత్సవ ఊరేగింపు వేడుకలో శ్రీ స్వామివారిని భక్తకోటి దర్శించి తరించుట ఈ అలంకార సేవ వేడుకలోని ప్రత్యేకత.

ధార్మిక,సాహిత్య, సంగీత మహాసభలు (సాంస్కృతిక కార్యక్రమాలు)

శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండపైన ధార్మిక,సాహిత్య, సంగీత మహాసభలు సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం యాదగిరిగుట్ట శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య వారిచే విష్ణుసహస్ర నామ పారాయణం నిర్వహించారు. శ్రీవేంకటఅన్నమాచార్య సేవా ట్రస్ట్ వారిచే అలంకార సేవల ముందు కోలాటం, నృత్యములు చేశారు. హైదరాబాద్ కు చెందిన బ్రహ్మశ్రీ. మైలవరపు శ్రీనివాసరావు నవనారసింహ తత్త్వము యాదగిరి క్షేత్ర వైభవముగూర్చి ఉపన్యసించారు. యడవల్లి శ్రీనివాస్ భాగవతార్ చేసిన గజేంద్ర మోక్షము హరికథా గానం శ్రోతలను అలరించాయి.
ఉచిత వైద్య శిబిరం

శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మియాపూర్ లోని గలాన్ హాస్పిటల్స్ వారిచే (ఎముకలు, నరాల వైద్య నిపుణులచే) ఉచిత వైద్య శిబిరం కొండపైన ప్రదాన కార్యాలయం వద్ద నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.