కార్పొరేట్ హాస్పిటల్స్ చైన్స్ పెరిగినా కొద్ది పేద ప్రజల ఆరోగ్యం విస్మరించ బడుతోంది డాక్టర్ విజయ్ వి. వెల్డండి
ముద్ర, శేరిలింగంపల్లి :
నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం, ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ సంయుక్తంగా ప్రజా వైద్యం, మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ-వాటి పరిణామాలు అనే అంశం పై సీఆర్ ఫౌండేషన్ కొండాపూర్ లోని ఇంద్రజిత్ గుప్తా హాల్ లో సెమినార్ జరిగింది. ఈ సెమినార్ కి నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం డైరెక్టర్ డా. టి. సురేష్ బాబు అధ్యక్షత వహించగా ‘ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. బుర్రి రంగా రెడ్డి గారిని మోడరేటర్ గా వ్యవహరించారు. మెంటర్ హెల్త్ లీడర్‌షిప్, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, యాంటీమైక్రోబియల్ స్టీవార్డ్‌షిప్ నిపుణుడు డా. విజయ్ వి. యెల్దండి ‘పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ మరియు దాని పరిణామాలు అనే అంశం’పై ప్రసంగించారు.
ప్రపంచ జీడిపి లో ఆరోగ్యరంగం 10 శాతం వాటా కలిగి ఉందని, ప్రస్తుతం ఇది యు ఎస్ డీ 122 బిలియన్గ ఉందన్నారు. 2024 నాటికి 200 బిలియన్కు చేరుతుందని అంచనా వేశారు. భారతదేశంలో ప్రైవేట్ రంగం 62 శాతం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉండి, 70 శాతం రోగులను చూసుకుంటోందన్నారు. ప్రైవేట్ ఈక్విటీ ప్రవేశం మరియు రెండవ, మూడవ స్థాయి నగరాలకు విస్తరణతో ప్రైవేటైజేషన్ వేగంగా పెరుగుతోందని ఆయన హెచ్చరించారు.
తాను ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకున్నానని, ఆ విద్య తనకు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించిందని డా. యెల్దండి గుర్తుచేశారు. ప్రస్తుతం మెడికల్ విద్య ఖర్చులు అధికంగా ఉండటం వల్ల, వైద్యులు ఆ ఖర్చులను తిరిగి సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోగులు ప్రత్యేక ఆసుపత్రుల్లోకి వెళ్లి అనేక పరీక్షలు చేయించుకోవడం వల్ల వారి జేబులు ఖాళీ అవుతున్న ఉదాహరణలు ఆయన ఇచ్చారు.
భారతదేశంలో హెల్త్‌కేర్ “సిక్‌కేర్”గా మారింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఏ ఐ, మెడికల్ టూరిజం, రోబోటిక్స్, డయాగ్నస్టిక్ హెల్త్‌టెక్ స్టార్టప్‌లు, కార్పొరేట్ హాస్పిటల్ చైన్లు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు మరింత పెరుగుతున్నాయని, పేద ప్రజల ఆరోగ్య అవసరాలు విస్మరించబడతాయని ఆయన హెచ్చరించారు. 2025–26 నాటికి భారతదేశంలో 1,29,000 ఎంబిబిఎస్ సీట్లు ఉండగా, వాటిలో 50 శాతం ప్రైవేట్ ఉన్నాయి. త్వరలో ఇది 80–88 శాతం కు చేరుతుందని ఆయన పేర్కొన్నారు.
1978లో డబ్లయు ఎచ్ ఓ మరియు యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన అల్మా-ఆటా డిక్లరేషన్ను ఆయన గుర్తుచేశారు. “హెల్త్ ఫర్ ఆల్” లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత కూడా ఆ లక్ష్యాలు సాధించలేకపోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో హెల్త్‌కేర్ ఇన్ఫ్లేషన్ అత్యధికంగా ఉందని, ఆసుపత్రి ఖర్చులు 20–40 శాతం పెరుగుతున్నాయి అని ఆయన తెలిపారు. ఖర్చులను తగ్గించడానికి ప్రివెన్షన్పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా డా. అరిఫ్ అహ్మద్, అలర్జీ నిపుణుడు మరియు యూరోపియన్ అకాడమీ ఆఫ్ అలర్జీ & ఇమ్యునాలజీ సర్టిఫైడ్ స్పెషలిస్ట్, జీవనశైలి కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులపై మాట్లాడారు. ఆయన ప్రకృతి దగ్గరగా జీవించడం, స్థానికంగా లభించే సంప్రదాయ ఆహారాలను తీసుకోవడం మంచిదని సూచించారు. ఫుడ్ ఇండస్ట్రీలో పరిశ్రమీకరణ పెరగడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. శిశువులకు రెండు సంవత్సరాల వరకు తల్లి పాలివ్వడం ద్వారా అలర్జీలు మరియు ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చని ఆయన సలహా ఇచ్చారు.
వక్తల ప్రసంగాల తరువాత సెమినార్ లో పాల్గొన్న వారితో ప్రశ్న జవాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. బుర్రి రంగా రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వక్తలు చెప్పిన విషయాలను క్లుప్తంగా వివరించారు.
ఈ సమావేశానికి హాజరైన వారికి సిఆర్ పాలిక్లినిక్ డైరెక్టర్ డా. కె. రజని స్వాగతం పలికి సెమినార్ వక్తలను పరిచయం చేశారు.
ఈ సెమినార్ లో సిఆర్ ఫౌండేషన్ గౌరవ చైర్మన్ డా. కె. నారాయణ, వివిధ రంగాల నుంచి వచ్చిన వైద్య
నిపుణులు, వైద్య విద్యార్థులు, నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం , సీఆర్ ఫౌండేషన్ సభ్యులు వృద్ధాశ్రమం వాసులు పాల్గొన్నారు.