సమజాంలో సమానత్వంను ప్రోత్సహించాలి.
బాలిక విద్య అవసరం
సమాజ మార్పులో మహిళా పాత్ర కీలకం.
బాలికలను శక్తివంతులుగా తీర్చిదిద్దాలి.
ముద్ర, తెలంగాణ బ్యూరో :
బాలికలను శక్తివంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం అన్ని వ్యవస్ధలపై ఉందని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. సామ్ కోషీ వెల్లడించారు. బాలికలను శక్తివంతం చేస్తే కుటుంబం శక్తివంతమవుతుందన్న ఆయన కుటుంబాలను శక్తివంతం చేస్తే దేశ భవిష్యత్తు బలపడుతుందని వ్యాఖ్యానించారు. బాల్య వివాహాలు, బాలలపై పలు రకాల లైంగిక వేధింపులు, లింగ వివక్షను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బాలికలపై ఉన్న వివక్ష నిర్మూలన, సమానత్వాన్ని ప్రోత్సాహం కోసమే ఏటా జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. గత కొన్ని దశాబ్దాల్లో సమాజంలో గణనీయమైన మార్పు వచ్చిందన్న ఆయన నేడు మహిళలు క్రీడలు, విజ్ఞానం, అంతరిక్ష పరిశోధన, న్యాయ రంగం సహా ప్రతి రంగంలో ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికి మహిళా రాష్ట్రపతి నాయకత్వం వహిస్తున్నారని, త్వరలోనే భారతదేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి రానున్నారని తెలిపారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర, హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా, అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ సహకారంతో శనివారం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో 2కే రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జస్టిస్ పి. సామ్ కోషీ అందులో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ హైకోర్టులో దేశంలోనే అత్యధిక సంఖ్యలో మహిళా న్యాయమూర్తులు ఉన్నారనీ దీన్ని గర్వంగా భావిస్తున్నామన్నారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో 60 శాతం కంటే ఎక్కువ మంది మహిళలే ఎంపికవుతున్నారని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నందా మాట్లాడుతూ జాతీయ బాలిక దినోత్సవం బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొనే లింగ వివక్షను నిర్మూలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బాలికల విద్య, ఆరోగ్య సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దేశ రథం ముందుకు సాగాలంటే పురుషులు, మహిళలు అనే రెండు చక్రాలు సమానంగా బలంగా ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. బాలికలను భారంగా చూసే మనస్తత్వం అనేక సామాజిక అన్యాయాలకు మూలమని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన ద్వారా బాలికలను సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఘటనల్లో నేరస్తులపై వేగవంతమైన దర్యాప్తు, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అవసరమైతే చట్టపరమైన వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆమె సూచించారు. బాలికల విద్య పేదరిక నిర్మూలనకు కీలకమని ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నాన్ వ్యాఖ్యలను ఆమె ఉదహరించారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం, దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణలో వైద్య శాఖ కీలక పాత్ర, మహిళలపై నేరాల నివారణలో పోలీసు శాఖ బాధ్యత, బాలికల విద్యను ప్రోత్సహించడంలో విద్యా హక్కు చట్టం ప్రాధాన్యత, ఈ అన్ని అంశాల్లో న్యాయవ్యవస్థ నిర్వహిస్తున్న పాత్రను ఆయన వివరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పాఠశాల విద్యార్ధులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, ఈ.వి. వెంకుగోపాల్, న్యాయమూర్తి జస్టిస్ రెనుక యారా, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ బి. సురేష్, సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి పట్టాభి, అదనపు జిల్లాసెషన్స్ జడ్జీలు అనిత , వినోద్, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి, హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఆశారాణి, స్వచ్ఛంద అసోసియేషన్ డైరెక్టర్ వినయ్ సింగ్, ఇతర న్యాయాధికారులు, న్యాయ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.
