వేదికగా మారిన చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
ముద్ర, చౌటుప్పల్ :
వారిద్దరూ ఉన్నత హోదాలో ఉన్న అధికారులు. వీరిలో ఒకరు ఐఏఎస్.. మరొకరు ఐపీఎస్.. అయినా నిరాడంబర వివాహంతో సమాజానికి కొత్త సందేశాన్ని ఇచ్చారు. ఎలాంటి ఆడంబరాలు, హంగులు లేకుండా… సీదాసాదాగా రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. వివాహం అంటే కోట్లాది రూపాయల ఖర్చు, ఆడంబరాలతో కూడిన వేడుకలు కనిపిస్తున్న నేటి సమాజంలో చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి సాదాసీదా పెళ్లి చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శనివారం ఈ అపురూప వేడుకకు వేదికగా మారింది. శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తుండగా, శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు. కేవలం అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఉన్నత అధికారుల సమక్షంలో వీరి వివాహం చట్టబద్ధంగా ముగిసింది. రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు చేసి పూలమాలలు మార్చుకొని ఈ జంట ఒక్కటయ్యారు. రూ. కోట్లు ఖర్చు చేసే వివాహాల కంటే ఇలాంటి నిరాడంబర వివాహాలు ఎంతో గొప్పవని, సామాన్యులకు ఇదొక స్ఫూర్తి అని అక్కడికి వచ్చిన అధికారులు వీరిని అభినందించారు. ఉన్నత చదువులు చదివి, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ కొత్త జంట తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.