ట్రాక్టర్లతో ధాన్యం రవాణా – రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ట్రాక్టర్లపై ధాన్యం రవాణా
లారీల కొరతకు ప్రత్యామ్నాయ దృష్టి
ధాన్యం, పంట ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలి
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
నేతన్నల బకాయిల రూ. 300 కోట్లు విడుదల
విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక నిర్ణయం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సిరిసిల్ల అభివృద్ధిపై గంభీరావుపేటలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ సమీక్ష
ముద్ర, రాజన్న సిరిసిల్ల :
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోన్న ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని డిప్యూటీ సీఎంం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. లారీల కొరతను సాకుగా చూపి ధాన్యం రవాణాను ఆపవద్దని చెప్పారు.

అవసరమైతే గ్రామాల్లో అందుబాటులో ఉండే ట్రాక్టర్లను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వానికి నిబంధనల కంటే రైతుల సంక్షేమమే ముఖ్యమన్న ఆయన దీనిపై తక్షణమే నివేదిక రూపొందించి పంపాలని ఆదేశించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని పీజీ సెంటర్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలోని పేద ప్రజల ముంగిటకే పాలనను తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వచ్చే నెల 15 లోపు సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మైనర్ రిపేర్లు, తాగునీరు, రన్నింగ్ వాటర్ సౌకర్యాలు పూర్తి కావాలని డిప్యూటీ సీఎం గడువు విధించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిధుల కొరత లేదని, పెండింగ్‌లో ఉన్న డైట్ ఛార్జీలను ఇప్పటికే క్రమబద్ధీకరించామని, ఇకపై ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తామన్నారు. సిరిసిల్ల నేతన్నల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే రూ. 300 కోట్ల బకాయిలు విడుదల చేశామన్న భట్టి విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు రూ. 2 వరకు తగ్గించేలా ఎన్‌పీడీసీఎల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించడం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని కొనియాడారు. పదేళ్లుగా అగమ్యగోచరంగా ఉన్న రేషన్ కార్డుల పంపిణీని తమ ప్రభుత్వం చేపట్టిందని డిప్యూటీ సీఎం అన్నారు. పేదలకు కిలో రూ. 60 విలువైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 52 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, లో-వోల్టేజ్ సమస్యల్లేకుండా సిరిసిల్లా జిల్లాలో 11 కొత్త సబ్ స్టేషన్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్న భట్టి… ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు. పదవీ విరమణ పొందిన వారికి రూ. 6వేల కోట్లతో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తున్నట్లు వివరించారు. జిల్లా యంత్రాంగం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చూడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేసే అధికారులకు తప్పని సరిగా గుర్తించి ప్రభుత్వం ఆవార్డులు, రివార్డులు ఇస్తుందన్నారు. పని చేయని అధికారుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో ముందు స్థానంలో ఉంచాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని నియమించాలని తెలిపారు. కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బంది రావద్దని స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కింద ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. చేనేత, వస్త్ర పరిశ్రమ కార్మికుల ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. వస్త్ర పరిశ్రమ కు పూర్తి మద్దతుగా ఉండాలని స్పష్టం చేశారు. భూ భారతి, సాదాబైనామా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కడా సమస్య ఉండవద్దని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, అందరి సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, బీడీ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేస్తామని, మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని మంత్రులకు హామీ ఇచ్చారు. కొనుగోలు సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. అంతకుముందు జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలలో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కొరకు కీలక నిర్ణయం తీసుకుంటూ, మొత్తం రూ. 30.05 కోట్ల అంచనా వ్యయంతో ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక , ఇంధన శాఖ మంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు చేతుల మీదుగా 10 నూతన 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రముల శంకుస్థాపన, ఒక ఉపకేంద్రం ప్రారంభోత్సవం చేశారు. ఈ సబ్‌స్టేషన్ల ద్వారా సుమారు 25,785 మంది వినియోగదారులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎన్ పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.