Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు ఆమోదం – సీఎం చంద్రబాబు నాయుడు హర్షం

 

అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆంధ్రుల దీర్ఘకాల ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమని తెలిపారు. రాజధాని అమరావతి ప్రస్థానంలో ప్రతి అడుగులో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

2015లో రాజధానికి శంకుస్థాపన జరిగినట్లు, 2025లో పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం జరిగినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియలో పూర్తి సహకారం అందించిందని సీఎం పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అమరావతి రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలు, చూపిన పట్టుదల మరువలేనివని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విజయాన్ని అమరావతి రైతులకు అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు.

అమరావతి ఇకపై ఆంధ్రులకు ఏకైక ప్రజా రాజధానిగా నిలుస్తుందని, రాజధాని అంశంపై ఇక ఎలాంటి అనుమానాలు లేదా చర్చలకు తావులేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎదురైన క్లిష్ట పరిస్థితులకు ఈ నిర్ణయం ముగింపు పలికిందని పేర్కొన్నారు.

ఏపీ అభివృద్ధికి ఈ నిర్ణయం కొత్త నాందిగా నిలుస్తుందని సీఎం తెలిపారు. అమరావతి దేశానికే ఆదర్శ నగరంగా అభివృద్ధి చెందుతుందని, సుస్థిరమైన రాజధానిగా నూతన శకానికి శ్రీకారం చుడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.