Take a fresh look at your lifestyle.

“అర్హుల జాబితాపై అభ్యంతరాలు”

  • అనర్హులను అర్హులుగా చేశారంటూ ఫిర్యాదులు.
  • ఉన్నోళ్లు అర్హులైతే..లేనోళ్ళ పరిస్థితి..?

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఇటీవల విడుదల చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల జాబితాలో ప్రజల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.అనర్హులను అర్హులుగా చేశారంటూ అధికారులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.అన్నీ ఉన్నోళ్లు అర్హులు అయితే కనీసం ఉండేందుకు ఇళ్ళు లేని పేద వాళ్ళ పరిస్థితి ఏంటనే చర్చ అసలైన అర్హులలో సాగుతుంది.మున్సిపాలిటీలో గోడపై అతికించిన లిస్టులో సొంత ఇల్లు,పట్టాలు కలిగిన వారితో పాటు సింగరేణి రిటైర్మెంట్ కార్మికులు,రాజకీయ పార్టీలకు చెందిన లీడర్ల దగ్గరి బంధువులను అర్హులుగా చేశారంటూ పుర ప్రజలు ఆరోపిస్తున్నారు. జాబితా విడుదలైన నాటి నుంచి నేటి వరకు వివిధ వాట్సప్ గ్రూపుల్లో,సామాజిక మాధ్యమాల్లో జాబితాపై చర్చలు జరుగుతున్నాయి.ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొని వారితో పాటు వేరే వార్డులకు చెందిన వ్యక్తులను మరో వార్డులో ఉంచడాన్ని పలువురు మాజీ వార్డు కౌన్సిలర్లు తప్పు పడుతున్నారు.చేపట్టిన సర్వేలను,అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇక బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టీ మరి అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు.ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సైతం అర్హుల జాబితాపై అభ్యంతరాలు తెలుపుతూ,జాబితాను పునః పరిశీలించాలంటూ వినతి పత్రాన్ని అందించారు.మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం పారదర్శకంగానే సర్వే నిర్వహించి అర్హుల జాబితాను పూర్తి చేసినట్లు చెపుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. ఇంకా ఎవరైనా నిజమైన అర్హులు ఉన్నట్లయితే పార్టీ లీడర్ల దృష్టికి పూర్తి వివరాలతో తీసుకురావాలంటున్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం అందించే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకే అందించాలనే డిమాండ్లు పేద ప్రజల నుంచి సర్వత్ర వినిపిస్తున్నాయి.చూడాలి మరి అనేక అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..? అర్హుల జాబితాలో ఏమైనా చేర్పులు,మార్పులు చేస్తారా..? ఆ జాబితానే ఫైనల్ చేస్తారా..? అనేది వేచి చూడాల్సిందే.

  • వేరే వార్డు వ్యక్తులు..మరో వార్డులో అర్హులు.

మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా అందుకు అనుగుణంగా అధికారులు అర్హుల జాబితాను తయారు చేశారు. వేరే వార్డుకు చెందిన కొందరిని మరొక వార్డులో అర్హులుగా చూపిస్తూ ఆ వార్డులో అసలైన అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లను దక్కకుండా చేస్తున్నారనే ఆరోపణలు కొందరు మాజీ వార్డు కౌన్సిలర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఏ వార్డుకు చెందిన వారిని ఆ వార్డులో చేర్చుతూ పేద ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా బుధవారం అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించాలని మాజీ వార్డు కౌన్సిలర్లు అధికారులను కోరారు.అర్హుల జాబితాను పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు.స్థానిక  5 వ వార్డు మాజీ కౌన్సిలర్ జిలకర మహేష్,17 వ వార్డు మాజీ కౌన్సిలర్ రామిడి ఉమాదేవి – కుమార్ అర్హులైన పేద ప్రజలతో కలిసి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుకు వినతి పత్రాన్ని అందించారు. అలాగే అర్హుల జాబితాలో అభ్యంతరాలు తెలిపేందుకు పుర ప్రజలకు మరో రెండు రోజులు గడువు (శుక్రవారం వరకు)  పెంచినట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు “ముద్ర ప్రతినిధితో” చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.