అరికపూడి గాంధీ – జగదీశ్వర్ గౌడ్ వర్గాల మధ్య కోల్డ్ వార్
కానరాని సఖ్యత – కొరవడిన ఐక్యత
పార్టీ భవిష్యత్ పై నీలినీడలు
ముద్ర, శేరిలింగంపల్లి:
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన్యత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఒకటి. రాజకీయ చైతన్యంతో పాటు ఆర్థిక వనరులకూ కొదవ లేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకూ ఆశ్రయం కల్పిస్తొందనడం అతిశయోక్తి కూడా ఏమీ కాదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మెజార్జీ ప్రజలు నియోజకవర్గంలో నివసిస్తుండగా మిగతా రాష్ట్రాలకు చెందిన వారు సైతం వేలాది మంది నివాసముంటున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ‘మిక్సుడు’ కల్చర్ అనే అభిప్రాయమూ ఏర్పడింది. ప్రజాసామ్యయుతంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రధాన నేతల మధ్య సమన్వయం కొరవడిందనే ఊహాగానాలు వ్యక్తమౌతున్నాయి. ఒకరు పార్టీ ప్రతినిథిగా మరోకరు ప్రజాప్రతినిధిగా ఉండి పార్టీని, పాలనను సమన్వయంతో నడపలేకపోతున్నారని, ఆ ఇద్దరు నేతలు తమ తమ వర్గాలను మాత్రమే కాపాడుకుంటూ రైలు పట్టాల మాదిరిగా సాగిపోతున్నారని విమర్శలున్నాయి. వీరిలో ఒకరు స్థానిక ఎమ్మెల్యే, పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ కాగా మరొకరు పీసీసీ ప్రధాన కార్యదర్శి వాలిదాస్ జగదీశ్వర్ గౌడ్. అధికార పార్టీ ప్రధాన ప్రతినిధులుగా ఉండి నియోజకవర్గంలో ప్రతి పక్షాలుగా వ్యవహరిస్తున్నారనే భావన కలిగిస్తున్నారని పార్టీ సీనియర్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారాసా నుండి పోటీ చేసి గెలిచిన అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లోకి మారడం, అదే పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన జగదీశ్వర్ గౌడ్ మద్య సయోద్య కన్పించడం లేదనేది నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల నానక్ రాంగూడలో ప్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరికెపూడి గాంధీ డౌన్-డౌన్, గాంధీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం ఇరు వర్గాల మద్య ఉన్న బేధాభిప్రాయాలను స్పష్టం చేస్తుంది. అధికారిక కార్యక్రమంలో పీయేసీ ఛైర్మన్ గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పై వ్యతిరేక నినాదాలు పీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ అనుచరులు చేసినవేనని గాంధీ వర్గం భావిస్తోంది. ప్రభుత్వ, ప్రయివేటు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల కార్యక్రమాలు నిర్వహించే సందర్భంగా ప్రచురించే ఫ్లెక్సీల్లో గాంధీ అనుచరులు జగదీశ్వర్ గౌడ్ ఫోటో, జగదీశ్వర్ గౌడ్ అనుచరులు గాంధీ ఫోటో వేయక పోవడం వారిలో సఖ్యత లేదనడానికి మరో ఉదాహారణగా చెప్పుకోవచ్చు. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించి జగదీశ్వర్ గౌడ్ అనుచరులు వేయించిన ఫ్లెక్సీల్లో అరికపూడి గాంధీ ఫోటో లేకపోవడాన్ని గుర్తించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచనతో మరికొన్నింటిని ముద్రించి అంటించారని కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో జరిగే ఒకటి రెండు కార్యక్రమాలు మినహా ఇద్దరూ కలిసి పాల్గొన్న కార్యక్రమాలు గత రెండేళ్లలో లేవనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతల కార్యక్రమాలు సైతం ఎవరికి వారే నిర్వహిస్తుంటారు. ఇక నియోజకవర్గంలోని అధికారుతో పనిచేయించుకోవడంలో అరికపూడిదే పై చేయిగా ఉందని జగదీశ్వర్ గౌడ్ అనుచరులు గుర్రుగా ఉన్నారు. అధికార పార్టీ నుండి పోటీ చేసిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా అధికారుల వద్ద సరైన ప్రాధాన్యత తనకూ, తన అనుచరులకు లభించడం లేదని సన్నిహితుల వద్ద జగదీశ్వర్ గౌడ్ వాపోయినట్టు విస్వసనీయ సమాచారం. ఇక పార్టీ పదవులు, సీట్ల కేటాయింపులలో ఎవరి వర్గానికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. ఏళ్ల తరబడిగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే అధికారం వచ్చాక అనుభవించలేకపోతున్నామని ఒరిజనల్ కాంగ్రెస్ అభిమానులు మదనపడమే కాకుండ, వలస పక్షులు అందలం ఎక్కుతున్నారని కార్యకర్తలు అసూయచెందుతున్నారని నియోజకవర్గంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే 2023 ఎన్నికల్లో మూడవ స్థానంలో నిలిచిన భాజాపా నియోజకవర్గ ఇన్ ఛార్జి రవికుమార్ యాదవ్ అడపా దడపా కార్యక్రమాలు చేపడుతూ తన పార్టీ కార్యకర్తలకు టచ్ లో ఉంటున్నారు. ఇక మెజార్టీ ఓట్లు సాధించి భారాసా అభ్యర్థిగా విజయం సాధించిన అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరడం, భారాసా నియోజకవర్గ భాద్యతలు సమీపంలోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాదవరం క్రష్ణారావుకు అప్పగించడంతో శేరిలింగంపల్లిలో ఆ పార్టీ అనాధగానే మిగిలిందని చెప్పుకోవాలి. మిగతా రాజకీయ పార్టీల భవిష్యత్ ఎలా ఉన్నా… రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండటం, స్థానిక ఎమ్మెల్యే అదే పార్టీలోకి దూకడం, వ్యక్తిగత ప్రాధాన్యతలతో ఆ పార్టీ పాత క్యాడర్ అసమ్మతితో కాలం వెల్లదీస్తున్నారు…ఈ కలహాల కాపురంతో త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ శేరిలింగంపల్లి నియోజవకవర్గ పరిధిలో ఎలా ఉండబోతొందోనని చర్చ మొదలైంది.
ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండవ సారి అధికారంలోకి రావడానికి గత కొంత కాలంగా ప్రత్యేక ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇటీవలే పార్టీ అంతర్గత శిక్షణ పేరుతో డీసీసీ అధ్యక్షులకు పది రోజుల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 2023 ఎన్నికల్లో భారాసా పక్షాన పోటీ చేసి 43.69 శాతం ఓట్లతో 72,968 ఓట్లు పొంది విజయం సాధించిన గాంధీ, 32.53 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయి రెండవ స్థానంలో నిలిచిన జగదీశ్వర్ గౌడ్ ఇద్దరూ కలిసి పనిచేస్తే అధికార కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదగనుందని పార్టీ అభిమానుల ఆశ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను కాంగ్రెస్ ‘హస్త’ గతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి పనిచేస్తారా…లేదా అంతర్గత కలహాలతో ప్రతి పక్ష పార్టీలకు ప్రాణం పోస్తారా వేచి చూడాలి.