వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి…
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందని, రైతులకు ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లును వేగవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మంగళవారం యాసంగి (రబీ) 2025-26 వరిధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రైతులు ప్రభుత్వంపై, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నమ్మకంతో ఉన్నారని, ఆ నమ్మకం నిలబెట్టే బాధ్యత సంబంధిత అధికారులు అందరిపై ఉన్నదని, అందుకు అనుగుణంగా రైస్ మిల్లర్లు, సొసైటీ సీఈవోలు, ప్యాక్స్ చైర్మన్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు అందరు సమన్వయంతో సకాలంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి యాసంగి (రబీ) 2025 – 26 విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోడౌన్లలో స్టాక్ ఉన్నదని, ఆ విషయం గమనించి సంబంధిత అధికారులు రైతులకు, మిల్లర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సీజన్ కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా రైస్ మిల్లర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని, సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోళ్ల లో సమస్యలుంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలే కానీ రైతులను మిల్లుల వద్దకు పంపవద్దని అన్నారు. మిల్లుల వద్ద సమస్యలు ఉంటే అధికారులు మిల్లర్లతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ రబీ సీజన్ కు జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడి వచ్చిందని, అందరం కలిసి సమన్వయంతో సహకారంతో ముందుకెళ్లాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా MRO, DT, CEO లు చర్యలు తీసుకోవాలని వారికి కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున హమాలీల కొరత ఉన్నదని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల వల్ల కొన్ని అడ్డంకులు ఉన్న కానీ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ తొందరగా చేయాలని అన్నారు. ఈ సమావేశానికి వచ్చిన మిల్లర్స్, రైతు నాయకులు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాల అందరి సమస్యలు జిల్లా మంత్రిగా నాకు తెలుసు నిత్యం జిల్లాలో అందుబాటులో ఉంటూ ఈ సీజన్ కొనుగోలు పూర్తి అయ్యేవరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. మొక్కజొన్న రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్ల ఆర్థిక భారం భరిస్తుందని అన్నారు. నిబంధనల మేరకు ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు పనిచేసి కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లుల వద్దకు ధాన్యం వెనువెంటనే తరలించాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు, ఉన్నత అధికారులకు తెలియజేయాలని సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ఉన్నతాధికారులు స్పందించాలని అన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ ) చేతన్ నితిన్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.