ముద్ర కూకట్‌పల్లి :
ఎల్లమ్మబండ భారతి విద్యాలయ పాఠశాల సమీపంలోని కమ్యూనిటీ హాల్‌ను కొందరు వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, అలాగే అక్కడి యూపీహెచ్‌సీ సెంటర్ వద్ద పేరుకుపోయిన మట్టితో రోగులు ఇబ్బంది పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై అధికారులు వేగంగా స్పందించారు.
కమ్యూనిటీ హాల్‌ను ఆక్రమించి రాజకీయ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, తద్వారా స్థానికులకు ఇబ్బంది కలుగుతోందని ‘టీమ్ సభ్యులు’ ఆల్విన్ కాలనీ సర్కిల్ డీసీ చాముండేశ్వరి కి ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన డీసీ సంబంధిత అధికారులను ఆదేశించి కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న రాజకీయ ఫ్లెక్సీలను తొలగింపజేశారు.నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ఈ హాల్‌ను ఎల్లమ్మబండలోని అన్ని కాలనీల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని డీసీ హామీ ఇచ్చారు.ఆసుపత్రి ప్రాంగణంలో పేరుకుపోయిన మట్టిని కూడా యుద్ధ ప్రాతిపదికన తొలగించి, రోగులకు మరియు స్థానికులకు మార్గం సుగమం చేశారు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించిన డీసీ చాముండేశ్వరి పనితీరుపై స్థానికులు మరియు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించినందుకు ‘టీమ్ సభ్యులకు’, అధికారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.