ముద్ర, తెలంగాణ బ్యూరో :
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే పార్లమెంట్‌లో డీలిమిటేషన్ పై కేంద్రం నిర్వహించతలపెట్టిన చర్చకు ముందుకు రావాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అనేది ఎన్నికల అంశం కాదన్న ఆయన ఇప్పటికే దానిని పార్లమెంట్‌లో అన్ని పార్టీల దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా రేవంత్ రెడ్డి ఒక మంచి లెక్కల టీచర్‌ను పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ప్రస్తుతం డీలిమిటేషన్‌లో భాగంగా ఉన్న స్థానాల్లో సగం స్థానాలు పెరుగుతాయని స్పష్టత ఇచ్చారు. మొదటి నుంచి నరేంద్ర మోడీ ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఉత్తరాదిన జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ సీట్లు పెరుగుతాయని, దక్షిణాదిన సీట్లు తగ్గుతాయని చెప్పారు. ఇలా అర్థం లేని వాదనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తామన్నా వ్యతిరేకించారని ఆరోపించారు. ఇప్పుడు 50 శాతం సీట్లు పెంచుతామంటే ఒప్పుకోమంటున్నారని మండిపడ్డారు.