- దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి తెర.
- లైడార్ సర్వేతో వనరుల మ్యాపింగ్.
- అన్ని విభాగాల విభజనలో ఏకరూపత.
- సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో :తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వివిధ రకాల నిర్మాణాలు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ సులభతరంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఇందుకు సంబంధించి పూర్తి అధ్యయనంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పౌర సేవలు, అనుమతులపై రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌లో వివిధ రకాల నిర్మాణాలకు ప్రజలు పలు విభాగాలకు దరఖాస్తులు చేసుకొని ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ఏదైనా నిర్మాణం లేదా గృహాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన సేవలకు ఒకే ప్లాట్‌ఫాంపై దరఖాస్తు అందజేస్తే వారికి అవసరమైన సేవలన్నింటికి సింగిల్ విండోలో అనుమతి లభించేలా ఉండాలన్నారు. ఇందుకు రెవెన్యూ, పురపాలక, జల వనరులు, నీటి సరఫరా, మురుగు నీటి పారుదల, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ తదితర విభాగాలు సంయుక్తంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.ఆయా శాఖల వసూలు చేసే బిల్లుల సైతం ఒకేసారి, ఒకే విండో ద్వారా చెల్లించే విధానం ఉండాలన్నారు.వినియోగదారులు చెల్లించే మొత్తాన్ని ఆయా విభాగాల ఖాతాల్లో జమ అయ్యే విధానాన్ని రూపొందించాలన్నారు.ఈ క్రమంలో ఆస్తులు, వనరుల గుర్తింపునకు లైడార్ సర్వే చేయాలని..మరింత సులభతర విధానాల అధ్యయనానికి నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు.పౌర సేవలు మెరుగ్గా అందేందుకు గానూ వివిధ శాఖల విభజనలో ఏకరూపత ఉండాలని సీఎం సూచించారు.అనుమతుల ప్రక్రియలో అనవసరమైన జాప్యం చేయకూడదని, ఏ కారణం లేకుండా అనుమతులను నిరాకరించడానికి వీల్లేదన్నారు.ఏదైనా కారణం చేత అనుమతులకు ఆలస్యమైతే అందుకు కారణాలు ఏమిటో దరఖాస్తుదారులకు తెలియజేసి వాటి పరిష్కారానికి ఏం చర్యలు తీసుకోవాలో కూడా అధికారులే సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్రపురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హెదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇ.వి.నరసింహారెడ్డి పాల్గొన్నారు.
