ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశాలు పకడ్బందీగా నిర్వహించాలి..
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి..
ముద్ర, కరీంనగర్:
జిల్లాలో నిర్వహించనున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశాలను అత్యంత పకడ్బందీగా, ప్రజా పాలన ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా నిలిచేలా సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె సూచించారు.

ఈ నెల 16వ తేదీ గురువారం మండల స్థాయిలో జరిగే సమావేశాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఎంఈఓలు, ఎంపీవోలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల స్థాయి సమావేశాలను విజయవంతం చేయడానికి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని సూచించారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు రుణాలు, కార్పొరేషన్ల ద్వారా అందించిన రుణాలు, మహాలక్ష్మి పథకం, సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలపై ప్రత్యేకంగా వివరించాలన్నారు. మండలాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, రైతు సంక్షేమం వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని తెలిపారు. అదేవిధంగా, రోడ్డు భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేయాలని, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించాలని సూచించారు. జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టే విధంగా సమావేశాలను నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీపీఓ జగదీశ్వర్, ఇన్‌చార్జి సీపీఓ రామ్ దత్తారెడ్డి, డీఎంహెచ్వో వెంకటరమణ, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, డీఎస్ఓ నర్సింగరావు, డీఆర్డీఓ శ్రీధర్, సంక్షేమ అధికారి సరస్వతి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ తదితర అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.